
- కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వెల్లడి
న్యూఢిల్లీ: కులగణన నిర్వహించి దేశాన్ని ఎక్స్ రే తీస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కులగణన ద్వారా దేశంలోని ప్రతిఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ట్విటర్ లో ఆయన పేర్కొన్నారు. అంబానీ, అదానీల నుంచి కాంగ్రెస్ పార్టీకి టెంపోల్లో డబ్బులు అందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణపైనా ఆయన స్పందించారు.
గత పదేండ్లుగా బీజేపీ నేతలకే అంబానీ, అదానీల నుంచి టెంపోల్లో డబ్బులు అందుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా తమకు అంబానీ, అదానీలు డబ్బు పంపి ఉంటే సీబీఐ, ఈడీతో ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక గణనపై అభిప్రాయం ఏంటో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ డిమాండ్ చేశారు.
తల్లులందరికీ సాల్యూట్
మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి సోనియాతో మాట్లాడుతున్న ఫొటోతో పాటు భారత్ జోడో యాత్ర సందర్భంగా పలువురు మహిళలతో ఆయన మాట్లాడిన ఫొటోలను షేర్ చేశారు. ప్రేమ, త్యాగం, సహనం, శక్తి వంటి పదాలు కూడా తల్లి గురించి వర్ణించడానికి సరిపోవు అని ఆయన పేర్కొన్నారు.