భారతీయ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ నెలలో ఐటీ స్టాక్స్ భారీగా పతనమవ్వడంతో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోల విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనే దేశీయ టాప్ ఐటీ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి విలువ ఏకంగా రూ.50వేల కోట్లు ఆవిరైపోవడం ఆందోళనలు పెంచేస్తోంది.
కారణం ఏమిటి?
ఈ పతనం జస్ట్ ప్రాఫిట్ బుక్కింగ్ వల్ల వచ్చింది కాదు. దీని వెనుక జనరేటివ్ ఏఐ గురించిన ఆందోళనలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తుండటంతో భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఇది కేవలం తాత్కాలిక తగ్గుదల మాత్రమే కాదు, ఐటీ సేవల డెలివరీ పద్ధతుల్లో వస్తున్న నిర్మాణాత్మక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈసారి రికవరీ ఎప్పుడు ఉంటుందనే విషయంలో స్పష్టత కనిపించటం లేదు.
ACE ఈక్విటీస్ డేటా ప్రకారం జనవరి చివరి నాటికి టాప్ 10 ఐటీ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ల మొత్తం ఎక్స్‌పోజర్ రూ.3లక్షల 56వేల కోట్లుగా ఉండేది. అయితే ఐటీ షేర్లు కుప్పకూలడంతో ఫిబ్రవరి 13 నాటికి ఆ విలువ రూ.3లక్షల 04వేల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 52 వేల కోట్లు ఆవిరైంది. ఒక్క వారంలోనే టెక్ ఫండ్ల రిటర్న్స్ 6 శాతం తగ్గగా.. నెలవారీగా చూస్తే 12 శాతం ప్రతికూల రిటర్న్స్ నమోదయ్యాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజాలు రెండంకెల స్థాయిలో పతనం కావడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 14 శాతం మేర క్షీణించింది.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి..?
మీ పోర్ట్‌ఫోలియోలో ఐటీ ఫండ్ల వాటా 5-10 శాతం లోపు ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ పెట్టుబడిలో 25-30 శాతం కేవలం టెక్ ఫండ్లలోనే ఉంటే మాత్రం రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఇక్కడ 'బై ద డిప్' టెక్నిక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
SIP ఇన్వెస్టర్లు ఎక్స్‌పోజర్ తక్కువగా ఉంటే పెట్టుబడులను కొనసాగించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఒకవేళ టెక్ ఫండ్ల వాటా ఎక్కువగా ఉంటే, భవిష్యత్ SIPలను డైవర్సిఫైడ్ ఫండ్ల వైపు మళ్లించడం మంచిది. ఇక లంప్సమ్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఐటీ రంగంలో క్లారిటీ వచ్చే వరకు వేచి చూడటం మంచిది. కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. మొత్తానికి ఐటీ రంగంలో వస్తున్న మార్పులను కంపెనీలు ఎలా తట్టుకుంటాయో చూశాకే నిర్ణయం తీసుకోవాలని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో సమతుల్యత కాపాడుకోవడమే ప్రస్తుతం కీలకం అంటున్నారు.
