బ్యాంకు లాకర్లలో మన విలువైన వస్తువులు, బంగారం లేదా ఏదైనా భద్రంగా ఉంటుందని అనుకుంటాం... కానీ కస్టమర్లు దాచుకున్న బంగారాన్ని, ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజరే కొట్టేసి, అక్రమంగా తాకట్టు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకారం ఏం జరిగిందంటే... నిందితుడు బ్యాంకు లాకర్ల నుండి 2,780 గ్రాముల అంటే సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వీటి విలువ దాదాపు 3.5 కోట్లు ఉంటుందని అంచనా.
అయుతే ఉన్నతాధికారులకు తెలియకుండా లాకర్ల నుంచి బంగారం తీసి, ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు.
పోలీసుల విచారణలో ఆ డబ్బును నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వాడినట్లు బయటపడింది. ఈ నెల ఫిబ్రవరి 5న బ్యాంకు చీఫ్ మేనేజర్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా... మిగిలిన బంగారం రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఫైనాన్స్ కంపెనీలు:
బంగారం తాకట్టు పెట్టుకున్న ఫైనాన్స్ కంపెనీల నుంచి కేసుపై సహకారించట్లేదని, అందుకే కోర్టు ద్వారా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ (DCP) లోకేష్ జగలసర్ తెలిపారు. మీ బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం భద్రంగా ఉందో లేదో ఒకసారి వెళ్లి చెక్ చేసుకోవాలని పోలీసులు కస్టమర్లకు సూచిస్తున్నారు.
