మన దేశంలోని కార్మిక చట్టాల (Labour Laws) ప్రకారం అసలు పరిశ్రమ అనే పదానికి సరైన అర్థం ఏంటి ? అనే దశాబ్దాల నాటి వివాదానికి తెరదించడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది. దీని కోసం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ఒక పెద్ద రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.
చాలా కాలంగా హాస్పటళ్లు, స్కూళ్లు/కాలేజీలు, క్లబ్బులు ఇంకా ప్రభుత్వ సర్వీస్ డిపార్టుమెంట్లను పరిశ్రమలుగా పరిగణించాలా ? లేదా ? అనే గందరగోళం ఉంది. ఒకవేళ వీటిని పరిశ్రమలుగా గుర్తిస్తే, అక్కడ పనిచేసే ఉద్యోగులకు కార్మిక చట్టాలు వర్తిస్తాయి, అలాగే వాళ్ళు యూనియన్లు పెట్టుకోవచ్చు లేదంటే ఆ సౌకర్యాలు ఉండవు.
1978లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఒక సంస్థను పరిశ్రమ అని పిలవాలంటే మూడు పరీక్షలు పాస్ అవ్వాలి. అలాగే సంస్థ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండాలి. ఇందులో యజమాని, ఉద్యోగి కలిసి పని చేయాలి. ప్రజల అవసరాల కోసం వస్తువులను లేదా సేవలను అందిస్తూ ఉండాలి.
ఈ తీర్పు వల్ల చారిటీ సంస్థలు, ఆసుపత్రులు కూడా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చాయి. అయితే, దీనిపై చాలా అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు 9 మంది న్యాయమూర్తుల బెంచ్ దీనిని మళ్ళీ సమీక్షించనుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. 21వ శతాబ్దపు మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమ అర్ధం మార్చాలా ? ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా పరిశ్రమలుగా చూడాలా ? అనేవి ప్రధాన అంశాలు.
ఈ కేసును త్వరగా తేల్చడానికి సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలు పెట్టింది. లాయర్లు డాక్యుమెంట్లను ఫిబ్రవరి 28, 2026 లోపు సమర్పించాలి. అలాగే వాదనలు వినిపించడానికి ప్రతి పక్షానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు, ముఖ్యంగా ప్రైవేట్ సహా ప్రభుత్వ సేవా సంస్థల్లో పనిచేసే వారి హక్కులపై స్పష్టత వస్తుంది.
