ప్యాకేజ్డ్ ఫుడ్‌ పై ‘హెచ్చరిక’ ఉండాల్సిందే..! FSSAIకు సుప్రీంకోర్టు ఆదేశం

ప్యాకేజ్డ్ ఫుడ్‌ పై ‘హెచ్చరిక’ ఉండాల్సిందే..! FSSAIకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ‘హెచ్చరిక’ ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ఆహార భద్రత– ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ని ఆదేశించింది. ప్రజారోగ్యంతో ఆటలాడొద్దని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.‘3 ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’  దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ  విశ్వనాథన్‌ బెంచ్ విచారించింది. 

పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ప్యాకెట్లపై చక్కెర, సోడియం, కొవ్వుల మోతాదు గురించి బోల్డ్ అక్షరాలతో హెచ్చరికలు ఉంటేనే ప్రజలు అప్రమత్తం అవుతారని అన్నారు. ఈ అంశంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ ... చర్చలు, సమావేశాలతో కాలక్షేపం చేయొద్దని ఎఫ్ఎస్ఎస్ఏని హెచ్చరించింది. 

ఈ అంశానికి సంబంధించి నాలుగు వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశించింది. అలాగే ఆహారంలోని అధిక చక్కెర, ఉప్పు, సాచ్యురేటెడ్ ఫ్యాట్ కు సంబంధించి వినియోగదారుడికి అర్థమయ్యేలా ప్యాక్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికల లేబుల్స్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది.