చెన్నై: నటి త్రిషపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగేంద్రన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో నాగేంద్రన్ వెనక్కి తగ్గారు. నటి త్రిషకు ఆయన క్షమాపణలు చెప్పారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని నాగేంద్రన్ ప్రకటించారు. ఉద్దేశపూర్వంగా ఆ కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఎట్టకేలకు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
అసలు నాగేంద్రన్ ఏమన్నాడంటే..?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత, హీరో దళపతి విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముందు వ్యక్తిగత, కుటుంబ విషయాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు, గొప్ప నాయకులు తమ ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలని హితవు పలికారు.
‘‘విజయ్‌కు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. దానికంటే ముందు అతను త్రిషకు దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడు’’ అని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు. విజయ్, త్రిషపై నాగేంద్రన్ చేసిన కామెంట్స్ తమిళ్ పాలిటిక్స్ లో పెను దుమారం రేపాయి.
నాగేంద్రన్ వ్యాఖ్యలపై అధికార డీఎంకే, టీవీకే, విజయ్ అభిమానులు భగ్గుమన్నారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను లాగడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై నటి త్రిష కూడా మండిపడింది. నాగేంద్రన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నటి.. ఆయన కామెంట్స్ చాలా అసహ్యంగా ఉన్నాయని సీరియస్ అయ్యింది.
తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని.. తనను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరో రెండు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఉన్న వేళ త్రిషపై చేసిన వ్యాఖ్యలు బూమారాంగ్ అవ్వడంతో నాగేంద్రన్ చివరకు ఆమెకు క్షమాపణలు చెప్పాడు.
