Vijay- Rashmika Wedding : విజయ్ - రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్!

Vijay- Rashmika Wedding : విజయ్ - రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో వారం రోజుల్లో ఏడడుగులు వేయబోతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఈ కపుల్ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది. ఇది అభిమానుల్లో కొత్త జోష్ ను నింపుతోంది.

రాజస్థాన్ వేదికగా వేడుకలు

 ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ ప్యాలెస్ విజయ్ రష్మికల వివాహానికి వేదిక కానుంది. ఫిబ్రవరి 20వ తేదీ నాటికే ఇరు కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ చేరుకుంటారని, 22వ తేదీ నుండి హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని సమాచారం.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు విజయ్ రష్మిక ఉదయ్ పూర్ చేరుకున్నట్లు సమాచారం. 
 
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి వేడుక రాజస్థాన్‌లో ముగిసిన తర్వాత, హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులకు ఈ వేడుకకు ఆహ్వానాలు అందనున్నాయి. వైరల్ అవుతున్న ఈ ఆహ్వానం కార్డులో  "మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను, రష్మిక ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నాం. మా ప్రయాణంలో భాగమైన మీ అందరి సమక్షంలో ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మార్చి 4న తాజ్ కృష్ణలో జరిగే రిసెప్షన్‌కు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించండి." అని  విజయ్ దేవరకొండ పేరులో ఆహ్వాన పత్రిక ఉంది.

'గీత గోవిందం' టు 'రియల్ లైఫ్'

విజయ్, రష్మికల కెమిస్ట్రీకి వెండితెరపై విపరీతమైన క్రేజ్ ఉంది. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ జంట, ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'లో కూడా తమ నటనతో మెప్పించారు. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఒకే రకమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.

దీంతో ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఫ్యాన్స్, నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఈ కపుల్ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్లు ఉండేది. అయితే విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నల నిశ్చితార్థ వేడుక ఇప్పటికే నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. 2025 అక్టోబర్ 3, శుక్రవారం నాడు ఈ జంట ఉంగరాలు మార్చుకున్నట్లు సన్నిత వర్గాలు వెల్లడించాయి..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం 'రౌడీ జనార్థన్' తో పాటు మరో ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉండగా, రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్‌తో పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వృత్తిపరంగా ఇద్దరూ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి రిసెప్షన్‌కు ఆహ్వానం పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వెడ్డింగ్ కార్డ్ గురించి విజయ్ , రష్మిక నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.