బాలుడి హత్య కేసులో మైనర్ కు జీవిత ఖైదు

బాలుడి హత్య కేసులో మైనర్ కు జీవిత ఖైదు

శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్,వెలుగు: బాలుడి కిడ్నాప్, లైంగిక దాడి,హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ బార్కాస్ లో సంచలనం సృష్టించిన  పదేళ్ళ బాలుడి హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధించింది. నేరం చేసిన సమయంలో నిందితుడు మైనర్ కావడంతో రెండేళ్ల పాటు సుదీర్ఘ వాదనల అనంతరం అతడిపై నేరం రుజువైంది. దీంతో  పోక్సో కేసులో మైనర్ కు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇవ్వడం దేశంలోనే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే..  2017 జూన్ 28న హైదరాబాద్‌‌‌‌ పాతబస్తీ బార్కాస్‌‌‌‌లో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిని ఇంటి సమీపంలో ఉండే మైనర్ (15) దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కి పైన సింటెక్స్ ట్యాంక్ వెనక్కి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలుడు తన పేరెంట్స్ కు ఈ విషయాన్ని చెబుతానని చెప్పడంతో భయపడిన మైనర్ ఇనుప రాడ్ తో బాలుడి తలపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడిక్కడే చనిపోయాడు.

బాలుడి కోసం 2 రోజులు గాలించిన అతడి పేరెంట్స్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌‌‌‌లో కంప్లయింట్ చేశారు. మిస్సింగ్‌‌‌‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితునిగా ఓ మైనర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ హత్య సంఘటన వెలుగు చూసింది.

బాలుడి హత్య కేసు విచారణలో ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని లైంగిక దాడిచేసి చంపేసిన నిందితుడు గతంలోనూ తాను 15 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లైంగిక దాడి చేసిన అనంతరం విషయం బయటకు పొక్కకుండా వాళ్లకు డబ్బులిచ్చి నోరు మూయించేవాడినని పోలీసుల ఎదుట నిందితుడు  అంగీకరించాడు. బార్కాస్ ఘటనలో మాత్రం బాలుడు వినకపోవడంతో హత్య చేసినట్టు నిందితుడు వెల్లడించాడు.

నిందితుడైన మైనర్ ను పోలీసులు అరెస్టు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుల్లో పోలీసులు చార్జ్ షీట్ కోర్టులో సమర్పించారు. బాలుడిని కిడ్నాప్ చేసి, అత్యాచారం, మర్డర్ చేయడం లాంటివి సాక్షాధారాలు నిరూపణ కావడంతో నాంపల్లి కోర్టు జడ్జి…నిందితుడకి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే అత్యాచారం కింద 10  ఏళ్లు,  కిడ్నాప్  కేసులో మరో 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు.