మిర్చిని ముంచుతున్న తామర

మిర్చిని ముంచుతున్న తామర
  • నిన్న మిర్చి.. నేడు మామిడి
  • ముంచుతున్న‘తామర’
  • పూత రాకపోవడంతో  రైతుల టెన్షన్

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు, ఇప్పుడు ఇతర పంటలపైనా ప్రతాపం చూపుతోంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న మామిడిపై వైరస్​ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రస్తుతం మామిడి చెట్లపై పూత ఏర్పడకపోవడం, కొద్దిపాటి పూత కాస్తా రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రెండు నెలలుగా మిర్చి తోటల్లో వైరస్​ ప్రభావంపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధానాన్ని సూచించలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే వేల ఎకరాల్లో మిర్చిపంటను రైతులు తొలగించి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పుడు మామిడికి పురుగు పట్టడంతో వందల ఎకరాల్లో తోటలను కౌలు తీసుకున్న రైతులు పంటను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

ఇప్పటికే రూ.20 వేల పెట్టుబడి
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే  దాదాపు లక్ష ఎకరాల్లో ఉన్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఎక్కువగా తోటలు ఉన్నాయి. బంగినపల్లి, చిన్న రసాలు, తోతాపురి, తెల్ల గులాబీ, పెద్ద రసాలు తదితరాలు సాగవుతున్నాయి. సొంతంగా చేసుకునేవాళ్లు 10 శాతం మాత్రమే ఉండగా, 90 శాతం కౌలు రైతులే. తోటలను కౌలుకు తీసుకున్న రైతులు తొలిదశలో కూలీలతో పాదులు చేయించడం, సేంద్రియ, రసాయనిక ఎరువుల వాడకం, ఎండు కొమ్మలను తొలగించడం, నీరు పెట్టడం, ఎరువులు చల్లటం వంటి పనులను చేపట్టారు. రెండో దశలో పూత వచ్చేందుకు మందులు స్ప్రే చేశారు. ఇప్పటివరకు ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. అయితే వాతావరణ ప్రభావం, మంచు కారణంగా నేటికీ మామిడి తోటలకు పది శాతం కూడా పూత రాలేదు. ఈ ఏడాది మిర్చి పంటకు సోకిన తామర పురుగు వైరస్ మామిడి తోటలకు వ్యాపించిందని, అందువల్లే తోటలకు పూత రావడం లేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత మొత్తం రాలిపోతే దిగుబడి ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూరగాయలు సాగు చేస్తున్న రైతులు కూడా తామర పురుగు ప్రభావం తమపై ఉందని చెబుతున్నారు. తెల్ల పూత పూసే కూరగాయలైన చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ వంటి పంటలపై తామర పురుగు ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. పచ్చ పూత ఉండే టమాట, బీర, కాకర పంటలపై ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. 

తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 3,58,557 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 40 వేల మంది రైతులు 1,03,021 ఎకరాల్లో మిర్చి పంట వేశారు. ఇందులో దాదాపు   90 శాతం మిర్చి తోటల్లో తామర పురుగు ఎఫెక్ట్ ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. సుమారు 50 శాతం మంది రైతులు ఈసారి మిర్చి పంటల పరిస్థితిని చూసి పెట్టుబడులపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే 10 వేల ఎకరాల వరకు మిర్చి తోటలను ట్రాక్టర్లతో దున్నించి, ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు మొదలుపెట్టారు. ఒక్కసారి సోకితే మొక్క మొత్తాన్ని గుల్ల చేసేతామర పురుగు వ్యాప్తిని పురుగుల మందులు కూడా అడ్డుకోలేకపోతున్నాయి.

మందులు కొడుతున్నా ఫలితం లేదు
22 సంవత్సరాలుగా మామిడి తోటలు కౌలుకు తీసుకుంటున్న. ఈ ఏడాది సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు తీసుకున్న. మంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, తామర పురుగు ఆశించడంతో మామిడి చెట్లకు పూత రావడం లేదు. పూత వచ్చేందుకు ఇప్పటికే రెండుసార్లు వేలాది రూపాయల ఖర్చుతో ఖరీదైన మందులను స్ప్రే చేశా. అయినా ఫలితం లేదు. ఆఫీసర్లు చెబుతున్న సూచనలు పాటిస్తున్నా వైరస్​ పోవడం లేదు. 
– సయ్యద్ నబీ, మామిడి కౌలు రైతు, కల్లూరు

ప్రభుత్వం ఆదుకోవాలి
తామర పురుగు ఎఫెక్ట్​ను సకాలంలో గుర్తించి, నిర్మూలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో, రైతులకు సరైన సూచనలు చేయడంలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు విఫలమయ్యాయి. దీంతో మిర్చి, మామిడి తోటలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై తామర పురుగు తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో పంట నష్టపోయిన మిర్చి, మామిడి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. 
– బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం