45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్

45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్

తెలంగాణ స్టేట్ మండిపోయింది.. ఎండతో భగభగలాడింది. ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తుందా అన్నట్లు సెగగాలులు వీచాయి. 2024, ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికి జనం విలవిలలాడారు. కాలు బయట పెట్టటానికి భయపడ్డారు. ఇంట్లో ఉన్నా చెమటలు కక్కారు.

నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదు అయితే.. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత తక్కువగా నారాయణపేటలో 41.9 డిగ్రీలు నమోదైంది. అంటే తెలంగాణ స్టేట్ మొత్తం సరాసరి 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డ్ కావటం విశేషం. 

Also Read:ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..!

గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లిహిల్స్ 43 డిగ్రీలతో టాప్ లో ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో ఎండతో మండిపోయాయి. జనం ఆఫీసులు, ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ టెంపరేచర్ అంటే గాజులరామారాంలోనే 40.8 డిగ్రీలు నమోదైంది. 

తెలంగాణ రాష్ట్రం మొత్తం శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే.. సూర్యుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. ఏప్రిల్ 26వ తేదీనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటో అని భయపడుతున్నారు జనం.