ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఓ ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్​సిబ్బంది స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగామలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఆల్విన్​హెర్బల్ ఫార్మా కంపెనీ నడుస్తోంది. ఇందులో హెర్బల్​ప్రోడక్టులు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీ ఆవరణలో కొత్తగా షెడ్డు నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం దానికి సంబంధించిన వెల్డింగ్​పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగాయి. 

పక్కనే ఉన్న థర్మాకోల్, రబ్బర్, ఆల్కహాల్ తో నిండి ఉన్న 15 డ్రమ్ములపై పడి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన కొందరు కార్మికులు బయటికి పరుగులు తీశారు. బిల్డింగ్​పై ఫ్లోర్​లో దాదాపు 53 మంది చిక్కుకున్నారు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఓ బాలుడు తాడు సాయంతో 50 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. లోపల చిక్కుకున్న ముగ్గురు కార్మికులను నిచ్చెన సాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అటువైపు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

ప్రమాద సమయంలో ఓ బాలుడు చేసిన సాహసం 50 మంది ప్రాణాలు నిలిపింది. మంటలు చెలరేగడాన్ని గమనించిన సాయిచరణ్‌‌ ధైర్యంగా భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. మంటల్లో చిక్కుకున్న 50 మంది ఆ తాడు సాయంతో బయటికొచ్చారు. బాలుడు సకాలంలో స్పందించకుంటే సజీవ దహనమయ్యే వారిమని కార్మికులు తెలిపారు. సాయి చరణ్ సాహసాన్ని స్థానికులు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి  అభినందించారు. బాలుడికి ఎమ్మెల్యే శంకర్ రూ.10వేలు ఇవ్వబోతుండగా తీసుకునేందుకు నిరాకరించాడు. 

తన ఫ్రెండ్, ఫ్రెండ్​వాళ్ల తల్లి కంపెనీలో పనిచేస్తున్నారని, వారిని కలిసేందుకు అక్కడికి వచ్చానని సాయిచరణ్​ తెలిపాడు. అదే టైంలో మంటలు చెలరేగాయని, లోపలివాళ్లను బయటికి ఎలా తీసుకురావాలో అర్థం కాలేదని చెప్పారు. చివరికి పైకి ఎక్కి తాడు కడితే, బయటికి తీసుకురావచ్చనే ఆలోచన వచ్చిందన్నాడు. తాను మంటలు చెలరేగుతున్న బిల్డింగ్​పైకి తాడు కట్టినట్లు ఎవరికీ చెప్పొద్దని, ఇంట్లో తెలిస్తే అమ్మానాన్న తిడతారని చెప్పడం అక్కడివారిని ఆలోచింపజేసింది.