
- పనితీరు బాగుండటమే కారణం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఎస్అండ్పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు కురిశాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాని బలమైన ఆదాయాల తర్వాత ఏజెన్సీ దీనికి రేటింగ్‌ను పెంచాయి. ఎస్ అండ్ పీ, ఫిచ్ రేటింగ్‌లు విడుదల చేసిన నోట్స్ ప్రకారం... రిలయన్స్ ఇబిటా (ప్రీ-టాక్స్ లాభం అని పిలుస్తారు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరుగుతోంది. కంపెనీ అప్పు ఇబిటా నిష్పత్తి రేటింగ్ (బీబీబీ+/స్టేబుల్--)కి అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు ఎస్ అండ్ పీ నోట్ పేర్కొంది.
ఇటీవలి నెలల్లో కంపెనీ మీడియా వ్యాపారంలో పెట్టుబడులను పెంచిందని పేర్కొంది. 2024లో రిలయన్స్ రూ. 11,500 కోట్ల పెట్టుబడి పెట్టే మీడియా జాయింట్ వెంచర్ కోసం వాల్ట్ డిస్నీతో ఒప్పందాలను కుదుర్చుకుంది. కంపెనీ తదనంతరం స్థానిక ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పారామౌంట్ గ్లోబల్‌లో 13.01 శాతం వాటాను సుమారు రూ.4,300 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
ఈ పెట్టుబడులు కొన్ని కీలక పరిశ్రమలలో తమ బలం ఉండాలన్న రిలయన్స్వ్యూహానికి అనుగుణంగా ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీలు మెచ్చుకున్నాయి. తాజా ఆర్ఐఎల్ బంగాళాఖాతంలోని కేజీడీ6 బ్లాక్‌లో గ్యాస్ నిల్వలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అనుమతి పొందింది. దీంతో కంపెనీ గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 13–-17 శాతం పెంచుకోవచ్చు.
ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ముందుగా ప్రకటించిన పెట్టుబడులలో ఆయిల్- టు -కెమికల్స్ వ్యాపారం కోసం ఐదు సంవత్సరాలలో (2022 నుంచి) రూ.75 వేల కోట్ల విస్తరణ ప్రణాళిక ఉంది. రిలయన్స్ఆదాయాలు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతాయని అని ఎస్అండ్పీ తెలిపింది. సర్దుబాటు చేసిన ఇబిటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2-4 శాతం పెరగవచ్చని పేర్కొంది.
గత రెండేళ్లలో మాదిరిగానే, డిజిటల్ సేవల విభాగం (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్) వృద్ధికి కీలకంగా కొనసాగనుంది. సెగ్మెంట్ ఇబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదల రుణ విమోచనకు ముందు ఆదాయాలు) 2025 ఆర్థిక సంవత్సరంలో 10–-12 శాతం పెరుగుతుంది. రిలయన్స్ జియో వైర్‌లెస్ సబ్‌స్క్రయిబర్ బేస్‌తోపాటు ప్రతి వినియోగదారు నుంచి సగటు ఆదాయం పెరగనుంది. చమురు గ్యాస్ అలాగే రిటైల్ విభాగాలలో ఆదాయాలు, పెరిగిన ఉత్పత్తి పరిమాణం, విస్తృత రిటైల్ స్టోర్ నెట్‌వర్క్ వల్ల కంపెనీకి ఎంతో ప్రయోజనం జరుగుతుంది.
2025 ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మెరుగుపడుతుందని, 2024 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం పెరిగి రూ. 1.6 లక్షల కోట్లకు చేరుకుందని రేటింగ్ఏజెన్సీలు పేర్కొన్నాయి. అప్పులు కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశాయి. 2026 ఆర్థిక సంవత్సరం నుంచి దాని క్యాపెక్స్‌కు నిధులు సమకూర్చడానికి సంస్థ నగదు ప్రవాహం సరిపోతుందని ఫిచ్ అంచనా వేసింది. ఫిచ్ రిలయన్స్ని 'బీబీబీ'/స్టేబుల్‌గా రేట్ చేసింది.