హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉండే వాళ్లకు ఉద్యోగం ఇవ్వం : ముంబైలో సొంత ఇల్లు ఉంటే నీ జాబ్ ఎవడు చేస్తాడంటూ కౌంటర్లు

హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉండే వాళ్లకు ఉద్యోగం ఇవ్వం : ముంబైలో సొంత ఇల్లు ఉంటే నీ జాబ్ ఎవడు చేస్తాడంటూ కౌంటర్లు

ఎంతకు తెగించింది ఆ కంపెనీ.. ఉద్యోగులు కావాలని ప్రకటన ఇస్తూ.. ఓ కండీషన్ పెట్టింది. ముంబై లోకల్స్కు మాత్రమే ఉద్యోగం అని చెబుతూనే.. పీజీ హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉండే వాళ్లు ఈ ఉద్యోగానికి అనర్హులు అని.. ఏకంగా జాబ్ నోటిఫికేషన్ లోనే కండీషన్ అప్లయ్ చేయటంతో.. ఇంటర్నెట్ దుమ్ము దుమారం అయ్యింది. ఈ కథనం పూర్తి వివరాల్లోకి వెళితే..

మా కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ B.E. (CS/IT) అర్హత ఉండాలి. ఆధార్ కార్డు మస్ట్. ఆధార్ కార్డుపై ముంబై అడ్రస్ ఉండాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ముంబై లోకల్స్కు మాత్రమే ఉద్యోగం అని స్పష్టం అయ్యింది. ముంబై సిటీలో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కామన్. ఇక్కడే కంపెనీ మరో కండీషన్ పెట్టింది. ముంబై లోకల్ అయినా కూడా.. మీరు పీజీ హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉండే వాళ్లు అయితే ఈ ఉద్యోగానికి అనర్హులు అని ప్రకటించింది. ఇక్కడే నెటిజన్లు అందరికీ చిర్రెత్తుకొచ్చింది. పీజీ హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉంటే.. ఉద్యోగానికి ఎందుకు అనర్హత అవుతారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ కంపెనీ ఎందుకు ఇలా ప్రకటించింది.. ఇలాంటి కండీషన్ ఎందుకు పెట్టింది అనే విషయంపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. జీతం తక్కువగా ఇచ్చేందుకు ఇలాంటి ప్లాన్ వేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ముంబై సిటీలో అద్దెలు చాలా ఎక్కువ.. అదే సొంత ఇల్లు ఉన్నట్లయితే.. కంపెనీ తక్కువ జీతానికి ఉద్యోగులను తీసుకోవచ్చు అనే ప్లాన్ అని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ముంబై సిటీలో కొన్ని కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాయి. ఆయా కంపెనీల పరిధి.. నెట్ వర్క్ ఆ ఏరియాల వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఉద్యోగాలు ముంబై లోకల్స్ కు మాత్రమే అనే జాబ్ నోటిఫికేషన్స్ వెరీ వెరీ కామన్ అని.. ఈ జాబ్ నోటిఫికేషన్ లో మాత్రం పీజీ హాస్టల్స్, అద్దె ఇంట్లో ఉండే వాళ్లకు నో ఎంట్రీ అని చెప్పటం మాత్రం చాలా విడ్డూరం అని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరికొందరు నెటిజన్లు ఇలా స్పందించారు. ముంబై సిటీలో సొంత ఇల్లు ఉన్న వాళ్లు.. నీ దగ్గర ఎందుకు జాబ్ చేస్తారు బ్రో.. నీలాంటి కంపెనీలో ఉద్యోగం చేసే స్థాయి వాళ్లకు ఉంటుందా అంటూ కంపెనీపై నిప్పులు చెరిగారు. ఆ కంపెనీ పేరు చెప్పాలని.. కంపెనీ అడ్రస్ చెప్పాలంటూ మిగతా నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తూ..  మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ కాలంలో కంపెనీలు ప్రవర్తిస్తున్న తీరు.. వాళ్ల నోటిఫికేషన్లు చూస్తుంటే మరీ చిత్రంగా ఉంటున్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి తరహా నోటిఫికేషన్లు ఇంకెన్ని వస్తాయో చూడాలి మరి.