- బేగంబజార్, ధూల్‌పేట్, చూడీ బజార్ లో ఆరుగురు అరెస్ట్
- 2.622 కిలోల సరకు స్వాధీనం
బషీర్‌బాగ్, వెలుగు: హోలీ వేళ మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎస్‌టీఎఫ్ ఏ టీమ్, ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. బేగంబజార్, ధూల్‌పేట్, చూడీ బజార్ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో మొత్తం 2.622 కిలోల నిషేధిత బంగ్ను స్వాధీనం చేసుకుని, మూడు వేర్వేరు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. హోలీ సందర్భంగా డ్రై గంజాతో బంగ్తయారు చేసి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో బేగంబజార్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి చందర్ సింగ్, సాహెల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 860 గ్రాముల బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.
అదే ప్రాంతంలోని మరో ఇంటిపై సోదాలు నిర్వహించి భరత్ రాజ్ నందన్ యాదవ్, మహేశ్ అదుపులోకి తీసుకొని, 812 గ్రాముల బంగ్ను స్వాధీనం చేసుకున్నారు. చూడీ బజార్, ఊంట్ వాడీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సాగర్ శర్మ, అజయ్ శర్మను అరెస్ట్ చేసి 950 గ్రాముల బంగ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.
