గద్వాల, వెలుగు: రైతులకు సరిపడా యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ కోసం 8,124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 5,816 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సప్లై చేశామని తెలిపారు. కౌంటర్ల వద్ద రైతులు క్యూలైన్లలో వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నమని చెప్పారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి కౌంటర్ వద్ద షామియానా,తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు యాసంగి సాగుకు సరిపోతాయని, అవసరాన్ని బట్టి అదనంగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఏవో సక్రియా నాయక్, సంగీత లక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, మార్కెటింగ్ ఆఫీసర్ పుష్పమ్మ పాల్గొన్నారు.
నర్సింగ్ కాలేజీని ఓపెనింగ్‌కు రెడీ చేయండి..
పెండింగ్ పనులను కంప్లీట్ చేసి నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ ను ఓపెనింగ్‌కు రెడీ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని దౌదర్ పల్లి సమీపంలో నిర్మించిన నర్సింగ్ కాలేజీ బిల్డింగ్‌ను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. కాలేజీ ముందు సీసీ రోడ్డు నిర్మాణం, నీటి వసతి, విద్యుత్ సౌకర్యంతో పాటు మిగిలిన పెండింగ్ పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. బిల్డింగ్ పనులు పూర్తయ్యేంత వరకు పాత ఎస్పీ బిల్డింగ్ లేదంటే కేజీబీవీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
