Priyanka Mohan: ఓటీటీలో 'మేడ్ ఇన్ కొరియా' సునామీ.. గ్లోబల్ టాప్-1లో తొలి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్!

Priyanka Mohan: ఓటీటీలో 'మేడ్ ఇన్ కొరియా' సునామీ.. గ్లోబల్ టాప్-1లో తొలి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్!

దక్షిణ భారత సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదికపై అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' (Made in Korea) కేవలం ఐదు రోజుల్లోనే 4.1 మిలియన్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 జాబితాలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. డిజిటల్ దునియాలో రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

కథా నేపథ్యం..

దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రం, కష్టాల్లో ఉన్న 'శెంబ' (ప్రియాంక మోహన్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. పరిస్థితుల ప్రభావంతో దక్షిణ కొరియా వెళ్లిన ఆమెకు, అక్కడ ఎదురైన సవాళ్లు, సియోల్‌లో లభించిన కొత్త స్నేహితుల మద్దతుతో ఆమె జీవితం ఎలా మారిందనేది కథాంశం. ఈ క్రాస్-కల్చరల్ డ్రామా అటు భారతీయులను, ఇటు కొరియన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, దక్షిణ కొరియాతో సహా మొత్తం 24 దేశాల్లో ఈ చిత్రం టాప్-10లో కొనసాగుతోంది.

ఆనందంలో చిత్ర బృందం ..

ఈ ఘనతపై కథానాయిక ప్రియాంక మోహన్ స్పందిస్తూ.. ప్రతి కళాకారుడు కోరుకునే క్షణాలివి. శెంబ పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నిర్మాత శ్రీనిధి సాగర్ గారికి, దర్శకుడు రా కార్తీక్‌కు నా కృతజ్ఞతలు అని తెలిపారు. దర్శకుడు రా కార్తీక్ మాట్లాడుతూ, ప్రియాంక తన పాత్రలోకి ఒదిగిపోయిన తీరు అద్భుతమని, ప్రపంచవ్యాప్త స్పందన చూస్తుంటే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఎందుకు చూడాలి?

ప్రియాంక మోహన్‌తో పాటు పార్క్ హై-జిన్, సి-హున్ బెక్ వంటి కొరియన్ నటీనటుల కలయిక ఈ సినిమాకు సరికొత్త రంగును అద్దింది. భావోద్వేగాలతో కూడిన కథనం, అద్భుతమైన విజువల్స్ , కొరియన్ సంస్కృతిని భారతీయులకు పరిచయం చేసిన తీరు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమా హాలీవుడ్ స్థాయి చిత్రాలను వెనక్కి నెట్టి గ్లోబల్ ఛార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉండటం మన సినీ పరిశ్రమకు గర్వకారణమని సినీ వర్గా నుంచి  ప్రశంసలు అందుకుంటుంది. 

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ లిస్ట్‌లో 'మేడ్ ఇన్ కొరియా'తో పాటు మరికొన్ని భారతీయ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి.  'అక్యూజ్డ్' (Accused) హిందీ చిత్రం 1.5 మిలియన్ వ్యూస్‌తో ఆరో స్థానంలో ఉంది. ఇది వరుసగా మూడు వారాలుగా టాప్-10లో కొనసాగుతోంది. రణవీర్ సింగ్ నటించిన  స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఏడో స్థానంలో నిలిచింది. ఏడు వారాలుగా టాప్-10లో ఉన్న ఈ చిత్రం గతంలో నంబర్ వన్ స్థానాన్ని కూడా దక్కించుకుంది.