చెన్నై: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జాతర మొదలు కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శిక్షణ సమయంలో కండరాల గాయానికి గురి కావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు.
గాయం కారణంగా నాథన్ ఎల్లిస్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడని తెలిపారు. ‘‘ఇది మాకు పెద్ద దెబ్బ. ఎల్లిస్ కీలకమైన బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో. ఎల్లిస్ స్థానంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మతీషా పతిరానా స్థానంలో చెన్నై ఎల్లిస్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ టోర్నీ ప్రారంభం కాకముందే అతడి గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో డెత్ ఓవర్లలో చెన్నైను ముందుకు నడిపించే బౌలర్ కరువుయ్యాడు.
ఎల్లీస్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై మేనేజ్మెంట్ అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మ్యాట్ హెన్రీ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో అతడిది కీలక పాత్ర. సో.. ఈ డేంజరస్ బౌలర్ ను ఎల్లీస్ స్థానంలో చెన్నై తీసుకోనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. చెన్నై తమ ఐపీఎల్ 2026 సీజన్‌ను మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభించనుంది. అనంతరం వరుసగా ఏప్రిల్ 3, 5, 11 తేదీలలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
