రెండు రోజుల్లో రూ.22వేలు తగ్గిన వెండి.. కొత్త ఏడాదిలో ధర ఇంకా పడుతుందా..?

రెండు రోజుల్లో రూ.22వేలు తగ్గిన వెండి.. కొత్త ఏడాదిలో ధర ఇంకా పడుతుందా..?

డిసెంబర్ నెల చివరికి వస్తున్న వేళ రెండు రోజులుగా స్పాట్ మార్కెట్లో వెండి రేట్లు భారీగా పతనం కావాటంతో రిటైల్ మార్కెట్లలో కూడా ఆ తగ్గింపు కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా డిసెంబర్ 29, 30 తేదీల్లో రిటైల్ అమ్మకపు రేటు ఏకంగా రూ.22వేలు తగ్గుదలను చూసింది. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే 2026 అంటే కొత్త ఏడాదిలో కూడా ఇదే విధంగా రేట్ల తగ్గింపు కనిపిస్తుందా అనే ప్రశ్నకు చాలా మంది కొనుగోలుదారులు సమాధానం కోసం వెతుకుతున్నారు. 

సోమవారం ఎంసీఎక్స్ మార్కెట్లో కేవలం 3 గంటల సమయంలోనే రూ.18వేలు తగ్గిన వెండి రేటు మంగళవారం మార్కెట్లు ప్రారంభం కాగానే మళ్లీ తిరిగి పుంజుకుని ర్యాలీని స్టార్ట్ చేసింది. దీంతో ఒక్కరోజు భారీ పతనం తర్వాత వెండి ధర మళ్లీ పెరుగుతూ స్థిరంగా ముందుకు సాగుతోంది ప్రపంచ వ్యాప్తంగా. ఇంట్రాడేలో 4 శాతం పేరిగి కేజీ రేటు రూ.2లక్షల 36వేలకు చేరుకుంది ఇవాళ. ఇదే సమయంలో మార్చి నెలలో డెలివరీ ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ వెండి కేజీ రేటు రూ.2లక్షల 50వేలకు చేరింది.

వాస్తవానికి 2025లో వెండి రేట్ల ర్యాలీకి దారితీసిన ప్రధాన కారణాల గురించి తెలుసుకుంటే.. సెంట్రల్ బ్యాంకుల షాపింగ్, ఈటీఎఫ్ కొనుగోళ్లు, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపులు కీలకంగా ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. అయితే దీనికి తాత్కాలిక ఊహాగానాలు అస్సలు కారణం కాదని బ్రోకరేజ్ చెబుతోంది. ఈ క్రమంలో సాధారణంగా ఉండే బుల్ సైకిల్ స్థాయిలను దాటుకుని వెండి ర్యాలీని కొనసాగించిందని పేర్కొంది. అలాగే సరఫరా తగ్గుదల కూడా కారణంగా చెప్పింది. 

వెండి రేట్ల ర్యాలీలో మరో కీలకమైన పరిణామం చైనా తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు కూడా మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. చైనా తన దేశం నుంచి ఎగుమతులపై కూడా కొత్త ఏడాది నుంచి ఆంక్షలు విధించటం కూడా రేట్ల ర్యాలీకి కారణంగా ఉందని నిపుణులు అంటున్నారు.