Viral Video: షాకింగ్ వీడియో.. ఓవర్ లోడ్ పొట్టు లారీ.. అదుపు తప్పి బొలెరోపై పడింది..!

Viral Video: షాకింగ్ వీడియో.. ఓవర్ లోడ్ పొట్టు లారీ.. అదుపు తప్పి బొలెరోపై పడింది..!

రాంపూర్: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఆదివారం ఘోరం జరిగింది. నైనిటాల్ జాతీయ రహదారిపై పొట్టుతో వెళుతున్న లారీ ఓవర్ లోడ్ కారణంగా అదుపు తప్పి పక్కనే వెళుతున్న బొలెరో పైకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు.

పహాడీ గేట్ దగ్గరలోని గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టును తీసుకెళ్తున్న లారీ హైవే మీద వెళుతుండగా నియంత్రణ కోల్పోయి దాని పక్కనే వెళుతున్న బొలెరో వాహనం పైకి దూసుకెళ్లింది. పొట్టుతో పాటు లారీ మీద పడటంతో ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది.

బొలెరో డ్రైవర్ చనిపోగా.. బొలెరోపై 'ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం' అని రాసి ఉంది. ఈ బొలెరో ప్రభుత్వ వాహనంగా పోలీసులు గుర్తించారు. రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న బొలెరో నుంచి JCB సాయంతో డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. 

మొబైల్ నంబర్ ఆధారంగా మరణించిన డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బొలెరోలో ఒక వ్యక్తి మాత్రమే కనిపించాడని, ట్రక్కు కింద లేదా పొట్టు కింద మరెవరూ చిక్కుకున్నట్లు తెలియలేదని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓవర్ లోడ్ వాహనాలు రోడ్డెక్కితే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేసింది.