Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్

Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్

టీ20 వరల్డ్ కప్.. ఈ పొట్టి సమరానికి భారత జట్టును ప్రకటించడానికి సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో 15 మందితో  కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీకి ఎవరు సెలక్ట్ అవుతారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. భారత జట్టును ఖరారు చేసేందుకు రోహిత్ శర్మ.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. 15 మంది సభ్యుల జట్టులో టీమిండియా యువ ఓపెనర్ గిల్ ను ఎంపికపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. 

అద్భుత ఫామ్ లో ఉన్నా.. జైస్వాల్, కోహ్లీ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అతనికి గట్టి పోటీనిస్తున్నారు. దీంతో గిల్ కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా తన టీ20 వరల్డ్ కప్ ఎంపికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను తాను సమర్ధించుకుంటూ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడానికి తనకు అర్హత ఉందని పరోక్షంగా తెలిపాడు. ఈ సందర్భంగా 2023 ఐపీఎల్ సీజన్ ను గుర్తు చేశాడు. 2023 సీజన్ లో నేను దాదాపు 900 పరుగులు చేశాను. నన్ను సెలక్ట్ చేయకపోతే నేను చేసిన పరుగులకు విలువ ఉండదని నేను అనుకోను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా కళ. ఒకవేళ నేను సెలక్ట్ కాకపోతే ఇంట్లో కూర్చొని టీమిండియాను ఎంకరేజ్ చేస్తాను. అని గిల్ అన్నాడు. 

ఐపీఎల్ 2023 లో శుభ్‌మన్ గిల్ మూడు సెంచరీలతో సహా 890 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లోనూ రాణిస్తూ.. 38.00 సగటుతో.. 146.15 స్ట్రైక్ రేట్‌తో 304 పరుగులు చేశాడు.గిల్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు కెప్టెన్ గా, మరోవైపు బ్యాటర్ గా పర్వాలేదనిపిస్తున్నాడు. మరి గిల్ కు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.