కవ్వాల్ జోన్ లో వాహనాలకు అనుమతించాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కవ్వాల్ జోన్ లో వాహనాలకు అనుమతించాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్ లో ఎమ్మెల్యే బొజ్జు పటేల్​

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో భారీ వాహనాల రాకపోకలకు అటవీ శాఖ అనుమతులిచ్చి, అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. సోమవారం హైదరాబాద్​లోని అరణ్య భవన్​లో నిర్వహించిన రాష్ట్ర అటవీ శాఖ వైల్డ్ లైఫ్  బోర్డు మీటింగ్​లో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదివాసీల ఇబ్బందులను గుర్తించి జీవో 49ను నిలిపివేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు  కృతజ్ఞతలు తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక తరలింపులో ప్రజలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులు పెట్టవద్దన్నారు. కొన్ని దశాబ్దాలుగా పోడు సాగు చేస్తున్న అదివాసీలను ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రభుత్వంపై నిందలు పడుతున్నాయని, ఒంటెత్తు పోకడలకు పోతే ఓపిక నశించి ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. 

టైగర్ జోన్ పరిధిలో ఉన్న భూములను రెవెన్యూ, అటవీ శాఖ ఉమ్మడిగా సర్వే చేసి అడవిపై ఆదారపడి జీవనం సాగిస్తున్న అదివాసీలు, యాదవులు, మేదరులకు సాముహిక హక్కులను కల్పించాలని కోరారు. అటవీ హక్కు చట్టం ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సమవేశంలో రాష్ట్ర వైల్డ్ లైఫ్ ఆఫీసర్లు  పాల్గొన్నారు.