V6 News

సీసీఐ కథ ముగిసినట్లేనా?..తుక్కు కింద సామగ్రి తరలింపు కోసం టెండర్లు ఖరారు

సీసీఐ కథ ముగిసినట్లేనా?..తుక్కు కింద సామగ్రి తరలింపు కోసం టెండర్లు ఖరారు
  • సిమెంట్  ఫ్యాక్టరీ యంత్రాలు తరలించేందుకు ఏర్పాట్లు
  •     అడ్డుకున్న అఖిల పక్షం నాయకులు
  •     హైకోర్టులో కేసు ఉండగా టెండర్ల ఖరారుపై కార్మిక సంఘాల ఫైర్

ఆదిలాబాద్, వెలుగు: ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆదిలాబాద్  సిమెంట్  ఫ్యాక్టరీ కథ ఇక ముగిసినట్టే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్టరీలోని యంత్రాలు తుక్కు కింద విక్రయించాలని కేంద్రం భావిస్తుండగా, రెండు రోజుల కింద ముంబాయికి చెందిన ఓ కంపెనీ రూ.42 కోట్లకు టెండర్​ దక్కించుకుంది. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వర్కర్లతో సీసీఐలోని యంత్రాలు తరలించేందుకు బుధవారం ఏర్పాట్లు చేశారు. సిమెంట్​ ఉత్పత్తికి వినియోగించిన యంత్ర సామగ్రి, ఇతర అవసరాలకు వినియోగించిన ఇనుము, పాత వాహనాలు అమ్మేందుకు టెండర్లు దక్కించుకున్నారు. వీటిని తరలించేందుకు అంతర్గత రోడ్లను జేసీబీలతో క్లీన్  చేస్తున్నారు. చెట్లు, పొదలను తొలగిస్తున్నారు. 

భవనాల లోపల ఉన్న సామగ్రిని బయటకు తీస్తున్నారు. విషయం తెలుసుకున్న సీసీఐ భూనిర్వాసితులు, కార్మిక సంఘాలు, అఖిలపక్షం నేతలు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. సిమెంట్  ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. 49 మంది సీసీఐ కార్మికులకు సంబంధించిన టెర్మినల్  బెనిఫిట్స్  దాదాపు రూ.15 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై హైకోర్టులో కూడా కేసు నడుస్తోందని కార్మిక సఘాల నేతలు చెప్పారు. ఈక్రమంలో కేంద్రం సీసీఐ యంత్రాలను తుక్కు కింద అమ్మేందుకు టెండర్లు పిలవడం సరైంది కాదన్నారు. టెండర్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు ప్రిన్సిపల్  సెక్రటరీని కలిసేందుకు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు.

ఫ్యాక్టరీ మూతపడిందిలా!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అధిక లాభాలు తీసుకొచ్చిన పరిశ్రమగా.. వెనుకబడిన ఆదిలాబాద్ కు వెన్నుదన్నుగా నిలిచిన సిమెంట్  ఫ్యాక్టరీ శకం ఇక ముగిసింది. ఆదిలాబాద్  పట్టణ శివారులోని సీసీఐ ఫ్యాక్టరీలో వందేళ్లైన తరగని ముడిసరుకు ఇప్పటికీ అందుబాటులో ఉంది. సీసీఐకి సొంతంగా 870 ఎకరాలు, మరో 2 వేల ఎకరాల లీజు భూమి ఉంది. పరిశ్రమ నడిచే సమయంలో 4 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి లభించింది. మొదట్లో రాష్ట్రానికి లాభాలు తెచ్చిపెట్టిన ఫ్యాక్టరీ ఇప్పుడు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోనుంది. సీసీఐ ఫ్యాక్టరీలో 1982 ఆగస్టు 15న సిమెంట్​ ఉత్పత్తి ప్రారంభం కాగా, 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్డీ తివారీ చేతులమీదుగా జాతికి అంకితం చేశారు. 

అప్పటి నుంచి 1991 వరకు సిమెంట్  ఉత్పత్తి చేస్తూ దేశంలోని నలుమూలలకు సరఫరా చేశారు. 1991లో కేంద్రంలో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. దీంతో 1991,1992,1993 మూడేళ్లు వేల కోట్ల లాభాలు గడించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లెవీ పద్దతి( 60 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయడం)ని రద్దు చేయడంతో సీసీఐకీ బడ్జెట్  కేటాయింపులు నిలిచిపోయాయి. దీంతో 1993 అక్టోబర్ లో సీసీఐలో సిమెంట్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అప్పటి నుంచి సిమెంట్  ఫ్యాక్టరీ తెరిపించాలనే డిమాండ్  చేస్తూనే ఉన్నప్పటికీ చివరకు ఫ్యాక్టరీని తుక్కుగా విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

30 ఏళ్లుగా ఉద్యమాలు.. 

సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం 30 ఏళ్లుగా కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. మూడేళ్ల కింద సీసీఐ సాధన కమిటీ ఏర్పడి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం సీసీఐని అమ్మకానికి పెట్టిన ప్రతిసారి జిల్లాలో ఆందోళనలు జరిగాయి. నిరసనలు చేసిన సమయంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు సీసీఐ పునరుద్దరణ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారే తప్ప ఫ్యాక్టరీ తెరిపించడంలో మాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. 

2022, 2024, 2025లోనూ సీసీఐ సామగ్రిని తుక్కు కింద అమ్మేందుకు యాజమాన్యం టెండర్లు పిలవడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఆ టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా టెండర్లు ఖరారు కావడంతో జిల్లావాసుల ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ,ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారే ఉన్నప్పటికీ సీసీఐ పునరుద్ధరించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.

టెండర్  నిలిపివేయాలి

సీసీఐ కార్మికులకు టెర్మినేట్​ బెనిఫిట్స్ వచ్చేంత వరకు టెండర్లు నిలిపివేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. సీసీఐ మేనేజ్ మెంట్ సైతం గతంలోనే ఈ కేసులో సింగిల్  బెంచ్  నుంచి డివిజనల్  బెంచ్ కు వెళ్లింది. ఎలాంటి తీర్పు రాకుండానే తుక్కు కింద యంత్రాలు అమ్మేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. కోర్టులో కేసు ఉన్నందున కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం అందించాం.
‌‌‌‌ - ఎస్. విలాస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి