డీఎస్సీ-- 2003 టీచర్లకు పాత పెన్షనే ఇవ్వాలి.. సీఎస్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ 

డీఎస్సీ-- 2003 టీచర్లకు పాత పెన్షనే ఇవ్వాలి.. సీఎస్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ 

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–-2003 ద్వారా ఎంపికైన టీచర్లకు బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియామకాల్లో ప్రభుత్వ జాప్యానికి టీచర్లను బలి చేయడం సరికాదన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరుతూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. బాధిత అభ్యర్థుల డిమాండ్ నెరవేరేవరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

డీఎస్సీ-–2003 నియామక ప్రక్రియ 2004 జనవరి 1 కంటే ముందే ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. అయితే, పరిపాలనాపరమైన, విధానపరమైన జాప్యం కారణంగా పలువురు అభ్యర్థుల నియామకాలు 2004 జనవరి 1 తర్వాత పూర్తయ్యాయన్నారు. ఇందులో అభ్యర్థుల తప్పు ఏమీ లేకపోయినా, వారిని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి తీసుకురావడం అన్యాయమన్నారు. 

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు చేపట్టాలని కోరారు.