మన రెడ్లకే మస్తు పదవులు..9 కేబినెట్ స్థాయి పోస్టులిచ్చింది ఒక్క కేసీఆరే

మన రెడ్లకే మస్తు పదవులు..9 కేబినెట్ స్థాయి పోస్టులిచ్చింది ఒక్క కేసీఆరే
  • ఆరుగురు మంత్రులు, స్పీకర్, కౌన్సిల్​ చైర్మన్, రైతు బంధు కమిటీ చైర్మన్.. 
  • 9 కేబినెట్​ స్థాయి పోస్టులిచ్చిన ఘనత కేసీఆర్​దే: పల్లా రాజేశ్వర్​రెడ్డి
  • 33 శాతం ఎమ్మెల్యేలు, 40% ఎమ్మెల్సీలు, 33 % కార్పొరేషన్ ​చైర్మన్ ​పోస్టులు మనవే
  • జమ్మికుంట రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కామెంట్స్
  • పేరు చివరన రెడ్డి కంపల్సరీ పెట్టుకోవాలె.. అది మన హక్కు 
  • ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి


జమ్మికుంట, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే కాదు దేశ చరిత్రలోనే ఇంత మంది రెడ్లకు కేబినెట్​​లో స్థానం ఇచ్చింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్​ ఎవరికీ భయపడకుండా రెడ్డి సామాజికవర్గానికి గౌరవం ఇస్తున్నారని గుర్తు చేశారు. శనివారం జమ్మికుంటలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘2014 తర్వాత ఆరుగురు కేబినేట్​ మంత్రులు, ఒక స్పీకర్, ఒక కౌన్సిల్​ చైర్మన్, రైతుబంధు కమిటీ చైర్మన్ మొత్తం తొమ్మిది కేబినెట్ స్థాయి పదవుల్లో రెడ్లు ఇంతకు ముందు ఎప్పుడూ లేరు, ఇక ముందు ఉండరు. పక్క స్టేట్​లో జగన్​ కేబినెట్​లో గాని.. వైఎస్ ​సీఎంగా ఉన్నప్పుడుగాని ఇంతమందికి పదవులు ఇవ్వలేదు. 33 శాతం ఎమ్మెల్యేలు, 40 శాతం ఎమ్మెల్సీలు, 33 శాతం కార్పొరేషన్​ చైర్మన్​ పోస్టులు మనకే ఉన్నాయి. మనకు గౌరవం, నాయకత్వం ఇచ్చింది కేసీఆర్ ​మాత్రమే’’ అని గుర్తు చేశారు. 

సామాజిక వర్గానికి  కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, బుద్వేల్​లో కోట్ల రూపాయల విలువైన భూమిని సామాజిక భవనం కోసం ఇచ్చారని, భవనానికి రూ.10 కోట్లు ఇచ్చారని,155 గజాల స్థలాన్ని రెడ్డి కాలేజీ కోసం కేటాయించారన్నారు. అదరక బెదరక ఇప్పటికే ఏడు సార్లు 50 వేల కోట్లను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో  రైతు బంధు ద్వారా అందించినట్లు తెలిపారు. “ఐదెకరాలు, పదెకరాలు ఉన్న రైతులకు కట్ చేయండి అని చాలా మంది చెప్పారని..  ఇక్కడ కూర్చున్న వారికే (రెడ్డి సామాజిక వర్గానికి) ఉపయోగపడుతుంది. దీన్ని ఇవ్వొద్దని కూడా ఇక్కడి ఎమ్మెల్యే ఈటల అన్నారు. కచ్చితంగా ఇచ్చి తీరుతామని కేసీఆర్ ఇచ్చారు”అని చెప్పారు. రైతు బంధును వ్యతిరేకించిన,  ఈటల కావల్నా.. కులమతాలకతీతంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ కావాల్నో నిర్ణయించుకుని.. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని అన్నారు.

పేరు చివరన రెడ్డి ఉండాల్సిందే: పోచారం

‘కొంతమంది ఇటీవల కాలంలో ఎందుకో భయపడి కొడుకుల పేర్ల చివరన రెడ్డి అని పెట్టు కోవడం లేదు. తప్పనిసరిగా పెట్టుకోవాలి.  గర్వంగా.. మన సాంప్రదాయం నిలబెట్టే విధంగా పేర్ల చివర కచ్చితంగా రెడ్డి అని పెట్టుకోవాల్సిందే. అది మన హక్కు ఎవరికి భయపడాలి మనం” అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఒక అన్నగా.. తమ్ముడిగా మీ కుల బంధువుగా మిమ్మల్ని అందరినీ పలకరించి పోదామని వచ్చాను. స్పీకర్ హోదాలో రాలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గానే వచ్చాను. మనం ఏమన్నా దోచుక తింటున్నమా..  ఎవరికన్నా మోసం చేస్తున్నమా..  ఊర్లో 10 మంది రెడ్డిలు ఉంటే వెయ్యిమందికి సహకారం చేసే మనస్తత్వం మనది.  మన ఇంట్లో లేకపోయినా పేదోడు దవాఖానకు పోతుంటే తీసుకో వెయ్యి రూపాయలు అని జేబు నుంచి తీసి ఇచ్చే మనస్తత్వం మనది.  మనం ఎందుకు భయపడాలి’ అని వ్యాఖ్యానించారు.  రెడ్డి సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి పేరు చివర రెడ్డి అనే రెండు అక్షరాలు తగిలించుకుంటే బాగుంటుందని చమత్కరించారు.

రెడ్డి కార్పొరేషన్​కు కృషి:  మంత్రి హరీశ్ రావు 

ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గంలోని నిరుపేదలను ఆదుకోవడానికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేసీఆర్​ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అగ్రవర్ణాల్లో ఉండి ఆర్థికంగా వెనకబడిన వారికి సైతం కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీలు, తెలంగాణ రాష్ర్టంలో ఎక్కడైనా ఒక లక్ష రూపాయల అభివృద్ధి ప్రజలకు చేశారా  అని ఎద్దెవా చేశారు. హుజూరాబాద్​ ప్రజల ఆత్మాభిమానాన్ని మంటకల్పిన ఈటలను చిత్తుచిత్తుగా ఓండించాలన్నారు.

కేసీఆర్​దే ఘనత: మంత్రి నిరంజన్​రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశంలో ధాన్యాగారంగా మారిందని, ఈ ఘనత కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేనన్నారు. ఈటల రాజేందర్ మంత్రి స్థాయిలో ఉండి ఒక శాసనసభ్యుడి స్థాయిలో పనిచేశాడని, ఆయనను పెంచి పోషించిన గులాబీ జెండాను తుంచిన స్వార్థపరుడని, ఈ ఉప ఎన్నికతో ఆయన ఇంటికి బిస్తరి  కట్టుకపోవడం తప్పదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.