హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై చెత్త వేయడంతోపాటు చెత్త తగలబెడితే జరిమానాలు వేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. బుధవారం జవహర్‌నగర్, అంబేద్కర్‌నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. జవహర్‌నగర్‌లో రోడ్ల పక్కన చెత్తను తగలబెడుతుండగా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
జవహర్‌నగర్ – మల్కారం రోడ్డును పరిశీలించిన కమిషనర్.. రోడ్ల పక్కన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను పడేస్తుండడాన్ని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవహర్‌నగర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎదురుగా ఉన్న డంపింగ్ సైట్‌ను పరిశీలించారు. హైదరాబాద్ సాలిడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జవహర్‌నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో రామ్‌కీ సీఎస్ఆర్ నిధులతో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ ప్రతిపాదించారు.
కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాల మెరుగుదలకు రామ్‌కీ, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డీసీ వసంత, డీఈ, ఏఈలు, రామ్‌కీ అధికారులు పాల్గొన్నారు.
