- దేశ ప్రయోజనాల కంటే ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యమని విమర్శ
హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలను కాంక్షించి చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తోందని బీజేపీ స్టేట్చీఫ్ ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. దేశ ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన కోసం ప్రధాని మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మోదీ సూచనలను పాటించాలని ఆయన కోరారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ సోలార్ పంపులు వాడండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించండి, స్వదేశీ వస్తువులే కొనండి అని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. లండన్, అమెరికా వంటి దేశాల్లో ప్రధానులు, మంత్రులు కూడా మెట్రోల్లో ప్రయాణిస్తారని, అది వారి ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని, మోదీ చేసినవి కేవలం సూచనలే తప్ప బలవంతపు ఆంక్షలు కావని స్పష్టం చేశారు. 2013లో చిదంబరం కూడా బంగారం కొనకండి అని కోరినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
ఇబ్బందులు రాకుండా మోదీ ముందుచూపు
యూపీఏ పాలనకు, మోదీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని రాంచందర్ రావు పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల అమెరికా, కెనడా వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు 40 నుంచి 60 శాతం పెరిగినా, భారత్‌లో కేంద్రం ధరలను స్థిరంగా ఉంచిందన్నారు. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇంధనం కోసం రేషన్ పద్ధతి అమలవుతోందని, మన దేశంలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రధాని ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పారు.
1962 చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ఆనాడు ఆహార కొరత దృష్ట్యా బియ్యం, రొట్టెల వినియోగం తగ్గించాలని, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా సోమవారం పూట భోజనం మానేయాలని కోరారనీ, మరి అప్పుడు అవి ఆంక్షలు కాదా? అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ హయాంలో తక్కువ మాట్లాడండి ఎక్కువ పనిచేయండి అన్న నినాదంతో పాటు, బంగారం కొనవద్దని పిలుపునిచ్చారని అన్నారు.
