
- లోన్ ఇస్తారా.. లూటీ చేయనా?
- బ్యాంక్‌లో తుపాకీతో ఓ సన్యాసి హల్‌చల్
- తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఘటన
చెన్నై: లోన్ ఇస్తారా.. బ్యాంక్‌ను లూటీ చేయనా? అంటూ ఓ సన్యాసి తుపాకీతో బ్యాంక్‌లో హల్‌చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో జరిగింది. మూలంగుడి గ్రామంలోని ఇదిమిన్నల్ (ఉరుము, తుఫాను) సంగమానికి చెందిన సన్యాసి తిరుమలై సామికి ఓ కూతురు ఉంది. ఆమె చైనాలో మెడిసిన్ చదువుతోంది. కూతురు చదువు కోసం కొంత డబ్బు అవసరం పడింది. దీంతో లోన్ కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ బ్యాంక్ అధికారులకు లోన్ విషయం గురించి చెప్పగా, వాళ్లు తాకట్టు కింద ఆస్తి పత్రాలు అడిగారు. దీనికి ఆయన నిరాకరించాడు.
తీసుకుంటున్న లోన్‌కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని, అలాంటప్పుడు తాకట్టు పెట్టుకునేందుకు తన ఆస్తి పత్రాలను ఎందుకు అడుగుతున్నారని ఆ సన్యాసి ప్రశ్నించాడు. దీంతో బ్యాంక్ అధికారులు ఆయన లోన్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సన్యాసి తన ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకొని, బ్యాంక్‌కు తిరిగి వచ్చాడు. అక్కడే ఓ కుర్చీలో కూర్చుని, స్మోక్ చేస్తూ తుపాకీతో బ్యాంక్ అధికారులను బెదిరించడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఈ తతంగానంతా తన ఫేస్‌బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. తనకు లోన్ ఇవ్వకుండా నిరాకరించినందుకు బ్యాంకును లూటీ చేస్తానని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు వచ్చి, ఆ సన్యాసిని అదుపులోకి తీసుకున్నారు.