మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

నగరంలోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నిండు కుండలా మారిపోవడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. దీంతో వరద నీరు భారీగా మూసీ నదిలోకి వచ్చి చేరుతోంది. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధానంగా మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అక్కడి పరిస్థితి తెలుసుకొనేందుకు స్వయంగా ట్రాఫిక్ DCP & ట్రాఫిక్  ట్రాఫిక్ ACP బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. రాకపోకలను నిలిపివేయడమే బెటర్ అని నిర్ణయించారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా భారీ గేట్లు వేసి క్లోజ్ చేశారు. ఎవరూ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగించవద్దని అధికారులు సూచించారు. జంట జలాశయాల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీకి వరద ప్రవాహం పెరిగిందన్నారు. వరద ప్రవాహం పెరుగుతుందని ముందుగానే బ్రిడ్జిని క్లోజ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మార్గం గుండా వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక జంట జలాశయాల విషయానికి వస్తే.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ రెండు రిజర్వాయర్లు నిండుకుండలా మారిపోవడంతో అధికారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష గండం పొంచి ఉంది. రాగల మూడు రోజులకు వాతవరణ పలు సూచనలు చేసింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ 040-21111111 ను సంప్రదించాలన్నారు.