బిడ్డలను కాపాడి తల్లి సజీవ సమాధి

బిడ్డలను కాపాడి తల్లి సజీవ సమాధి
  • యూపీలోని ప్రయాగ్‌‌రాజ్‌‌లో ఘోర ప్రమాదం
  • గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్‌‌తో చెలరేగిన మంటలు
  • చివరకు మంటల్లో చిక్కుకుని ‘అర్చన’ మృతి

ప్రయాగ్‌‌రాజ్(యూపీ): ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పంటుకోగా.. ఓ తల్లి ప్రాణాలకు తెగించి తన బిడ్డలను కాపాడుకుంది. అందరినీ కాపాడి, తాను మాత్రం మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ప్రయాగ్‌‌రాజ్‌‌లో మే 12న రాత్రి జరిగిన ఈ దారుణానికి సంబంధించి బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్​రాజ్​లోని ఓ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్‌‌లో క్రాకరీ (పింగాణీ పాత్రల) దుకాణం, గోడౌన్ ఉండగా.. పై అంతస్తుల్లో కుటుంబం నివసిస్తోంది.

రాత్రి 9 గంటల ప్రాంతంలో దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి భవనమంతటా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో కిందికి దిగే దారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులంతా భయాందోళనలతో భవనం పైకప్పు మీదికి పరుగులు తీశారు. ఆ సమయంలో అర్చన అనే మహిళ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించింది. ఏడాది వయసున్న తన బిడ్డను ఒక బెడ్‌‌షీట్‌‌లో చుట్టి, పక్క భవనానికి మధ్య ఉన్న 12 అడుగుల ఖాళీ ప్రదేశం గుండా జాగ్రత్తగా అవతలికి చేర్చింది.

పొరుగింటివారు ఆ పసికందును సురక్షితంగా లోపలికి లాక్కున్నారు. ఆ తర్వాత, ఒక నిచ్చెన సహాయంతో తన 13 ఏండ్ల, 10 ఏండ్ల కుమార్తెలను, తన మేనల్లుడిని కూడా పక్కనే ఉన్న టెర్రస్‌‌పైకి పంపింది. ఈ క్రమంలో అర్చన తీవ్రమైన మంటలు, పొగలో చిక్కుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె 13 ఏండ్ల కుమార్తెకు కూడా గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పైకప్పు పైనుంచి దూకిన అర్చన తోడికోడలి కాలు విరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని, గంటల తరబడి శ్రమించి మంటలను ఆర్పేశారు.