గెంటేసిన చోటే.. దండలతో ఆహ్వానం

గెంటేసిన చోటే.. దండలతో ఆహ్వానం

వేరే కులానికి చెందిన వాడని గత వారం ఓ బీజేపీ ఎంపీని  తమ గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకున్న గ్రామస్తులు తిరిగి వారే అతనికి పూలమాలలతో ఘనస్వాగతం పలుకుతూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.

కర్ణాటక రాష్ట్రం చిత్రాదుర్గ నియోజకవర్గానికి చెందిన ఎంపీ నారాయణ స్వామి ఈ నెల 16 న తుమ్కూరు జిల్లాలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ తాగునీటి ప్రాజెక్టు ప్రారంభానికి హాజరవుతుండగా గ్రామస్తులు అతన్ని అడ్డుకున్నారు. అతను దళితుడంటూ, తమ గ్రామంలోకి ప్రవేశిస్తే ఊరుకునేది లేదంటూ ఎంపీని గ్రామసరిహద్దు లోకి కూడా రానివ్వలేదు.

ఈ  ఘటన గురించి ఆ సమయంలో గ్రామస్తులపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. నాగరిక ప్రపంచంలో కూడా అంటరానివాడంటూ ఒక ఎంపీనే అడ్డుకోవడంపై  అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు మండిపడ్డారు. జరిగిన పొరపాటును తెలుసుకున్న ఆ గ్రామస్తులు సోమవారం ఆ ఎంపీ నారాయణ స్వామిని తమ మత నాయకులు, పూజారుల సమక్షంలో గ్రామంలోకి ఆహ్వానించారు. పూలదండలు వేసి ఘన స్వాగతం పలికారు.

దీనిపై   నారాయణస్వామి మాట్లాడుతూ “గ్రామస్తుల హృదయాన్ని, మనసును మార్చడంలో తాను విజయం సాధించానని,  ఇది చాలా పెద్ద మార్పు” అని అన్నారు.

MP A.Narayanaswamy,was welcomed by villagers in Tumkur's Gollarahatti village