కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే

కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే

కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్​పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మల్యే రాజాసింగ్, విజయశాంతి,  లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ..  పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి అని ఆయన కొనియాడారు.

‘దేశాన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ  నాయకులు నియంత, కుటుంబ, అరాచక పాలనతో దేశాన్ని పట్టి పీడించారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి. పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి.  50 ఏళ్లు ఎంపీగా, 5  సార్లు జాతీయ అధ్యక్షులుగా కొనసాగిన నేత వాజ్ పేయి. డబ్బులతోనే రాజకీయాలను శాసిస్తూ, పార్టీలు మారుతున్న ఈ కాలంలో.. కార్యకర్తలను, సిద్దాంతాలను నమ్ముకుని దేశానికి సుపరిపాలన అందించిన మహానేత వాజ్ పేయి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం. అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం. గులాబీ చెట్టుకు ముళ్లు, పూల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవి. వాజ్ పేయి సున్నిత హృదయుడు. అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటిన నేత వాజ్ పేయి. కార్గిల్ యుద్దంలో విజయం సాధించి.. పాకిస్తాన్  ను దోషిగా నిలబెట్టిన నేత వాజ్ పేయి. విదేశీ సంబంధాలను మెరుగు పర్చిన నాయకుడు వాజ్ పేయి. దుష్ట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ... నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపిన నాయకుడు వాజ్ పేయి. ఐక్య రాజ్యసమితిలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రసంగించిన గొప్ప నేత వాజ్ పేయి. టెలిఫోన్ వ్యవస్థను పేద వాడి వరకు చేర్చి అతి తక్కువ ధరకే సెల్ ఫోన్ సేవలు అందేలా చేసిన మహా నాయకుడు వాజ్ పేయి. ప్రధాని అవాస్ యోజన ఇండ్ల నిర్మాణానికి ఆద్యుడు కూడా వాజ్ పేయి. వాజ్ పేయి స్పూర్తితో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శక్తవంతమైన భారత్ నిర్మాణమవుతోంది. ఒకప్పుడు విదేశీ ప్రతినిధులకు తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. కానీ నేడు విదేశీ ప్రతినిధులకు భగవద్గీత, శ్రీరాముడి ప్రతిమలను అందిస్తూ కొత్త ఒరవడిని సృష్టించిన నేత నరేంద్ర మోదీ. దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడిని అవమానించిన మూర్ఖుడు స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణం. రాష్ట్రాన్ని ఏలుతున్న భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్.. తొలుత నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలి. కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే.  మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదు. యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలి. వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉంది’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

For More News..

ప్రపంచంలోని గొప్ప నేతల్లో వాజ్​పేయి ఒకరు

కేటీఆర్ ఆయన తెలంగాణకు వస్తే తరిమి కొడతాం: రాజాసింగ్

మంచిర్యాలలో దారుణం.. మత్తెక్కలేదన్నా సర్జరీ చేసిన్రు