వారి క‌న్ను కొత్త‌పేట పండ్ల మార్కెట్ భూముల‌పై ప‌డింది

వారి క‌న్ను కొత్త‌పేట పండ్ల మార్కెట్ భూముల‌పై ప‌డింది

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్న ఆయన.. ధాన్యం నింపేందుకు బ‌స్తాలు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమ‌ర్శించారు.

మ‌న రాష్ట్రంలో పండిన బత్తాయి పండ్లను ప్రభుత్వం కొనే ప్రయత్నం చేయలేదని, బత్తాయి రైతులు తిరగబడితే అప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోమని చెప్పింద‌న్నారు. కానీ అప్పటికే జ‌రిగాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని , బ‌త్తాయి మురిగి పోయిందని అన్నారు. కందులు, బత్తాయి, పసుపు, వరి ఇలా ఏ పంటకూ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు.

కొత్త పేట నుంచి హడావిడిగా పండ్ల మార్కెట్ ను కోహెడ కు ఎందుకు తరలించారో ప్రభుత్వం చెప్పాలన్నారు రేవంత్. కోహెడలో తాత్కాలిక షెడ్డు కూలి 26 మందికి తీవ్రగాయాలు అయితే ,ఇప్పటివరకూ మంత్రులు వాళ్ళను పరామర్శించలేద‌న్నారు. ప్రభుత్వ పెద్దల కన్ను కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ భూములపై పడిందన్నారు. కోహెడ లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేవరకు ఫ్రూట్ మార్కెట్ కొత్తపేట్ లోనే ఉంచాలన్నారు. కోహెడ ఘటన లో గాయపడిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు తగ్గించి.. చేతల్లో చూపెట్టాలన్నారు.