రిలయన్స్ రికార్డ్..మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లు

రిలయన్స్ రికార్డ్..మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లు

ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్‌‌లో బుల్ రంకెలేసింది. బెంచ్‌‌మార్క్‌‌ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో పరుగులందుకున్నాయి. హెవీ వెయిట్స్ ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌లకు వచ్చిన లాభాలతో సూచీలు రివ్వున ఎగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌‌ను దాటేసింది. ఓ వైపు వరల్డ్ మార్కెట్‌‌లలో నష్టాలున్నప్పటికీ, మన మార్కెట్ ఇసుమంతైనా దాన్ని పట్టించుకోలేదు. ఫారిన్ ఇన్వెస్టర్ల నుంచి ఇన్‌‌ఫ్లోస్‌‌ కూడా వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 41,163.79 వద్ద ఆల్‌‌ టైమ్ హై మార్క్‌‌ను తాకింది. చివరికి 109.56 పాయింట్ల లాభంతో 41,130.17 వద్ద ముగిసింది. ఇది కూడా సెన్సెక్స్‌‌కు రికార్డు క్లోజింగే. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ కూడా 50.45 పాయింట్లు లాభపడి 12,151.15 వద్ద తాజా లైఫ్‌‌ టైమ్ హైలో స్థిరపడింది. మార్కెట్‌‌ రికార్డు గరిష్ట స్థాయిలకు చేరుకోవడంతో, నిఫ్టీ బ్యాంక్‌‌ ఇండెక్స్ తొలిసారి 32 వేల మార్క్‌‌ను తాకింది.

వచ్చే వారమే ఆర్‌‌‌‌బీఐ మీటింగ్…

ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలతో వచ్చే కొన్ని క్వార్టర్లలో ఎకానమీ రికవరీ అవుతుందని సంకేతాలొస్తున్నాయి. అంతేకాక ఫారిన్ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్టర్లు కంటిన్యూగా ఇండియన్ ఈక్విటీలను కొంటున్నారు. ఆర్‌‌‌‌బీఐ కూడా వచ్చే మీటింగ్‌‌లో వరుసగా ఆరోసారి వడ్డీరేట్లకు కోత పెడుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడానికి వచ్చే వారమే ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతుంది. రెండో క్వార్టర్ జీడీపీ డేటా కూడా శుక్రవారం ప్రకటించబోతున్నారు. మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ సరియైన విధానాలు కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌‌లో అభిప్రాయపడ్డారు. దీంతో ఈ రెండింటిని మార్చడమో లేదా తీసివేయడమో చేస్తారని మార్కెట్ వర్గాల్లో ఆశాభావం నెలకొంది. డెరివేటివ్ కాంట్రాక్ట్‌‌ల ముగింపు నేపథ్యంలో కూడా మార్కెట్ పాజిటివ్‌‌గా ముగిసిందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌‌ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఎక్స్‌‌ఫైరీకి ముందు షార్ట్‌‌ కవరింగ్ నెలకొని ర్యాలీకి సహకరించినట్టు ట్రేడర్లు చెప్పారు.

సెన్సెక్స్ ప్యాక్‌‌లో ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌ టాప్‌‌ గెయినర్‌‌‌‌గా నిలిచింది. దాంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్‌‌బీఐ, టీసీఎస్, ఎల్‌‌ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్, స్మాల్‌‌క్యాప్ సూచీలు 0.97 శాతం వరకు పెరిగాయి. బీఎస్‌‌ఈ టెలికాం, మెటల్, రియాల్టీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 3.49 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌‌ఈ ఆటో ఇండెక్స్ మాత్రమే నష్టపోయింది. అటు డాలర్ల మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలహీనపడి 71.62 వద్ద ట్రేడైంది.

రూ.1.87 లక్షల కోట్లు సంపాదించిన్రు…

వరుసగా రెం డు రోజుల మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.87 లక్షల కోట్లు పెరిగింది.బీఎస్‌ ఈ లిస్టె డ్ కంపెనీల మార్కెట్ క్యాప్‌ ఈ రెండురోజుల్లో రూ.1,87,370.56 కోట్లు పెరిగి రూ.1,55,57,484.15 కోట్లకు చేరుకుం ది. మార్కెట్ రెం డో రోజూ సరికొత్త గరిష్ట స్థాయిలను తాకిన సంగతితెలిసిందే. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,163.79 వద్ద రి కార్డు గరిష్టానికి చేరుకుంది.

గూగుల్ ఫౌండర్స్‌‌ను దాటేసిన ముకేశ్..

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌ రూ.10 లక్షల కోట్లను దాటడంతో, ముకేశ్​ అంబానీ సంపద ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 60.5 బిలియన్ డాలర్లకు(రూ.4,32,798 కోట్లకు) చేరుకుంది. దీంతో ముకేశ్​ గూగుల్ ఫౌండర్స్ ల్యారీ పేజ్, సెర్జి బ్రిన్‌‌లను దాటేసి ప్రపంచంలోనే 9వ అతిపెద్ద సంపన్నుడిగా నిలిచారు. పేజ్‌‌ 59.6 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో, బ్రిన్ 57.5 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్ట్‌‌లో జెఫ్ బెజోస్ టాప్‌‌లో ఉన్నారు. ఫోర్బ్స్ 2019 రిచ్ లిస్ట్‌‌ విడుదలైనప్పటి నుంచి ముకేశ్​ నాలుగు స్థానాలు పైకి ఎగబాకారు. అప్పుడు 50 బిలియన్ డాలర్ల నికర సంపదతో 13వ స్థానంలో ఉన్నారు.

ఆర్‌ ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ .10 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌(ఆర్‌‌‌‌ఐఎల్‌‌) మార్కెట్‌‌లో మెరుపులు మెరిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్‌‌ దాటేసిన తొలి ఇండియన్ కంపెనీగా ఆర్‌‌‌‌ఐఎల్‌‌ రికార్డు సృష్టించింది. ఆర్‌‌‌‌ఐఎల్ షేర్లు గురువారం ఇంట్రాడేలో రూ.1,581.25 వద్ద సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయిని తాకాయి. చివరికి 0.65 శాతం లాభంతో రూ.1,579.95 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆర్‌‌‌‌ఐఎల్‌‌ రూ.10.02 లక్షల కోట్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ను చేరుకుంది. చివరికి కూడా రూ.10 లక్షల కోట్ల మార్క్‌‌పైనే మార్కెట్ క్యాప్ నమోదైంది. గత రెండు రోజుల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.36 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచైతే ఏకంగా 40.73 శాతం పెరిగింది. గత నెల కాలంలో ఈ కంపెనీ షేర్లు బీఎస్‌‌ఈలో 10 శాతం పెరిగాయి. బుధవారం రిలయన్స్ మార్కెట్ క్యాప్‌‌ రూ.9,91,381.07 కోట్లుగా ఉంది. ఈ నెల 19న కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.9.5 లక్షల కోట్లను క్రాస్ చేసింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌లు డిసెంబర్ నుంచి టారిఫ్‌‌లను పెంచనున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఆర్‌‌‌‌ఐఎల్ షేరు ఏకధాటిగా పెరుగుతూ ఉంది. మొదటనుంచి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్న ఆర్​ఐఎల్  షేర్​ ధర 1991 నుంచి ఇప్పటిదాకా  14,200% పెరగడం విశేషం.

జీపీఎల్ పేరిట సబ్సిడరీ ఏర్పాటు…

జియో ప్లాట్‌‌ఫామ్స్ లిమిటెడ్‌‌(జీపీఎల్‌‌) పేరిట నూరు శాతం సబ్సిడరీని ఆర్‌‌‌‌ఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ కంపెనీని ఈ నెల 15న ఇన్‌‌కార్పొరేట్ చేశారు. ఇది ఇంకా ఆపరేషన్స్ ప్రారంభించాల్సి ఉంది. దీని మూలధనం లక్ష రూపాయలు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి