రేపే ఢిల్లీలో మునావర్ షో.. పర్మిషన్ రిజెక్టెడ్

రేపే ఢిల్లీలో మునావర్ షో.. పర్మిషన్ రిజెక్టెడ్

ది ఫేమస్ కమెడియన్ మునావర్ ఫారూఖీ మరోసారి వార్తల్లోకెక్కాడు. హైదరాబాద్ లో అల్లర్లు మరవక ముందే.. ఢిల్లోలో షో చేపట్టేందుకు మునావర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల అతని షో సందర్భంగా హైదరాబాద్ అంతటా హై టెన్షన్ కొనసాగగా.. తాజాగా ఢిల్లీలోనూ అతను ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడంపై అనుమతిని నిరాకరించారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కు సంబంధించిన అనుమతి దరఖాస్తును తిరస్కరించినట్టు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో జరగాల్సిన ఈ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని- ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పర్మిషన్ క్యాన్సిల్ చేశారని సమాచారం.

మునావర్ ఫారుఖీ షో లపై ఇటీవల జరుగుతున్న సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోనూ అతను షో నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్,  హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మునావర్ షో ఉంటుందని ఆరోపిస్తూ అప్పట్లో బీజేవైఎం నేతలు తెలంగాణ డీజీపీని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లోనే కాదు.. బెంగళూరులో జరగాల్సిన మునావర్ షో సైతం అర్థాంతరంగా ఆగిపోయింది.