- మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి రూ.100 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐదేండ్ల కాలానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, అత్యవసర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త పాలకవర్గాలకు సూచించారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. సోమవారం చేవెళ్ల మున్సిపల్ కొత్త పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్, బీజేపీలు అనైతిక ఒప్పందాలు చేసుకున్నాయని, వికారాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ ఆఫీస్ నుంచే బీజేపీ బీ-ఫామ్స్పంపిణీ చేశారని ఆరోపించారు.
ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్మాజీ మేయర్బొంతు రామ్మోహన్, పీసీసీ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
