కల్లును నీరాగా మార్చే ఇండస్ట్రీ పెట్టాలె

కల్లును నీరాగా మార్చే ఇండస్ట్రీ పెట్టాలె

సీఎం కేసీఆర్ నిరంకుశంగా పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంగా బతకవచ్చిన అనుకుంటే బానిస రాజ్యం తెస్తున్నాడంటూ కేసీఆర్‌‌పై మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌‌లో నిర్వహించిన గౌడ గర్జన సభలో ఈటలతో పాటు కేంద్ర మంత్రి మురళీధరన్, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాటల మాట్లాడుతూ సమాజంలో చైతన్యవంతమైన జాతి గౌడజాతి అని అన్నారు.  ‘‘మీకు వేలమంది సంబంధాలుంటాయి. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అకృత్యాలు చూసి మీకు కడుపు మండితే సరిపోదు.. ఎలా ఆర్పాలో కూడా ఆలోచించండి” అని వారికి ఆయన పిలుపునిచ్చారు. 

కల్లును నీరాగా మార్చే ఇండస్ట్రీ పెట్టాలె

గౌడ సోదరులకు సైకిల్ మోటార్లు ఇవ్వాలని 2018 ఎన్నికల్లో తాను కోరానని ఈటల చెప్పారు. కల్లు మండువలు కట్టించాలని అడిగానని, ఇవి గౌడకులస్థులకే కాదు.. అన్ని కులాలకు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. గౌడ కులస్థులకు సైకిల్ మోటార్లతో పాటు, కల్లు మండువాల్లో షెడ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్‌‌ను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కల్లును నీరాగా మార్చే ఇండస్ట్రీ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తొలిసారిగా మురళీధరన్ రూపంలో గౌడ కులస్థులకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని ఈటల చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేబినెట్ సామాజిక వర్గాల సమతుల్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణలో 85 శాతం జనాభా అణగారిన వర్గాల వాళ్లే ఉన్నా రాష్ట్ర కేబినెట్‌లో సరైన ప్రాధాన్యం లేదని అన్నారు.

పేదరికానికి కులంతో పని లేదు

పేదరికానికి కులంతో పనిలేదని, దళితులతో పాటు అన్ని కులాల్లో పేదలు ఉన్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు ఇవ్వాల్సిందేనని, అలాగే మిగతా కులాల్లోని నిరుపేదలకు కూడా పది లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత సోదరుల ఖాతాల్లో పది లక్షలు జమ చేశాక వాటిని ఎలా ఖర్చు పెట్టుకోవాలనే స్వేచ్ఛ వాళ్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.