కుక్కకు గుడి కట్టిండు

కుక్కకు గుడి కట్టిండు

కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు. అందుకేనేమో చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం జరిగినా తట్టుకోలేరు. తమ పెంపుడు కుక్కలకు అంత్యక్రియలు చేసి వాటిమీద తమ ప్రేమను చాటుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ ఘటనే ఈ మధ్య తమిళనాడులో జరిగింది. శివగంగ జిల్లా మనమధురైకు చెందిన ముత్తు ఓ రిటైర్డ్ ఉద్యోగి. ఏడాది కిందట తన పెంపుడు కుక్క (టామ్) చనిపోయింది. దీంతో ముతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన కుక్క కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. మనమధురైలోని తన వ్యవసాయ భూమిలో రూ.80 వేలు ఖర్చు పెట్టి కుక్క కోసం ఏకంగా దేవాలయాన్నే నిర్మించాడు. ఆ గుడి మధ్యలో కాంస్యంతో చేసిన కుక్క విగ్రహం పెట్టించాడు. ఇక.. ముఖ్యమైన పండుగ దినాల్లో, అలాగే ప్రతి శుక్రవారం కుక్కకు పూజలు చేస్తుంటాడు. ఇలా కుక్కమీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు ముతు.

‘అనాదిగా కుక్కలంటే మా కుటుంబానికి చాలా ఇష్టం. 2010 లో టామ్ (పెంపుడు కుక్క)ను తెచ్చుకున్నా. అప్పటి నుంచి టామ్ ను నా కుటంబ సభ్యుల కంటే ఎక్కువ చూసుకున్నా. టామ్ అంటే నాకు చాలా ఇష్టం. టామ్ లేకుండా ఏ పని చేసేవాడిని కాను. కానీ 2021లో టామ్ చనిపోయింది. అందుకే టామ్ కు గుర్తుగా గుడిని కట్టించా’ అని ముతు గర్వంగా చెప్పాడు.