హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ -రేస్ అక్రమాలు, లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు పీకల్లోతు కూరుకుపోయారని, ఆ పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీపై, బండి సంజయ్ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. బండి భగీరథ్‌పై విచారణ పూర్తి కాకముందే అతని కుటుంబాలపై బురదజల్లడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను, వారి కుటుంబాలను టార్గెట్ చేయడం బీఆర్ఎస్ సంస్కృతి అని విమర్శించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని, ముందస్తు బెయిల్ తీసుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. అదే పని కాళేశ్వరం, లిక్కర్ స్కామ్ కేసుల్లో మీ నేతలు చేసినప్పుడు అది నైతికతగా కనిపించిందా అని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోస్టర్లు వేయించడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించడం ద్వారా బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.
మహిళల భద్రతపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని ఆయన విమర్శించారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2014లో తెలంగాణలో మహిళలపై నమోదైన కేసులు 14,147 ఉంటే, 2023 నాటికి అవి 23,679కి చేరాయని, అంటే బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో 67 శాతం నేరాలు పెరిగాయని గుర్తుచేశారు. మీ పార్టీ నేతలు, కార్పొరేటర్లపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు రాజీనామాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
