- సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎన్నికలు.. క్యాడర్ రెడీగా ఉండాలి: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో రాబోయే ఎన్నికల్లో పనిచేసే వారికి, గెలిచే వారికే టికెట్లు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ‘మేమే పెద్దోళ్లం.. మేమే గొప్పోళ్లం’ అంటే ఇక్కడ నడవదని.. కేవలం సర్వే ఆధారంగా, ప్రజల్లో పట్టున్న వారికే అవకాశం ఉంటుందని, పైరవీలు నడబోవని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ సిటీ ఆఫీసులో జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
రాజ్యసభ ఎంపీ రేఖా శర్మతో కలిసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ పరిధిలో మనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారని, ఈ బలం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, వార్డుల సంఖ్య 300 నుంచి 350కి పెరగొచ్చని, దానికి తగ్గట్టుగా బూత్ స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గ్రేటర్ పరిధిలోని మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి చెందిన వందల మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. జీహెచ్‌ఎంసీలో గెలుపే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పునాది కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, జిల్లా నేతలు పాల్గొన్నారు.
