ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్​కు నడాల్​

ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్​కు నడాల్​

పారిస్‌‌: స్పెయిన్‌‌ బుల్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌.. 14వసారి ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో ఐదో సీడ్​ నడాల్‌‌ 7–6 (10/8), 6–6తో ఆధిక్యంలో ఉన్న దశలో  మూడో సీడ్​ అలెగ్జాండర్‌‌ జ్వెరెవ్‌‌ (జర్మనీ) మ్యాచ్‌‌ నుంచి  వైదొలిగాడు. రెండో సెట్‌‌లో చీలమండ తిరగబడటంతో కనీసం నడవలేని స్థితిలోకి వెళ్లిపోయిన జర్మన్‌‌ ప్లేయర్‌‌ వీల్‌‌ చైర్‌‌పై కోర్టు బయటకు వెళ్లిపోయాడు. దీంతో నడాల్‌‌కు వాకోవర్‌‌ విజయం లభించింది. 3 గంటలా 13 నిమిషాల పాటు జరిగిన రెండు సెట్ల పోరాటంలో.. ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్‌‌లోనే నడాల్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసిన జ్వెరెవ్‌‌.. ఓ దశలో 4–2 ఆధిక్యంలో నిలిచాడు.కానీ ఏడో గేమ్‌‌లో నడాల్‌‌ సర్వ్‌‌ను కాపాడుకోవడంతో ఆధిక్యంలో 4–3కి తగ్గింది. అయితే ఎనిమిదో గేమ్‌‌లో కీలక టైమ్‌‌లో జ్వెరెవ్‌‌ రెండు తప్పిదాలతో సర్వీస్‌‌ను కోల్పోయాడు. ఫలితంగా నడాల్‌‌ 4–4తో స్కోరును సమం చేశాడు.

తర్వాతి గేమ్‌‌లో సర్వ్‌‌ను నిలబెట్టుకున్న నడాల్‌‌.. పదో గేమ్‌‌లో ఈజీగా గెలిచేలా కనిపించాడు. కానీ మూడు సెట్‌‌ పాయింట్లను కాచుకున్న జ్వెరెవ్‌‌.. సర్వీస్‌‌ నిలుపుకోవడంతో సెట్‌‌ టైబ్రేక్‌‌కు వెళ్లింది. టైబ్రేక్‌‌ ఆరంభంలో బలమైన సర్వీస్‌‌లతో దుమ్మురేపిన జ్వెరెవ్‌‌ 6–2 ముందంజలో నిలిచినా.. తర్వాత పట్టు వదిలేశాడు. దీంతో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గిన నడాల్‌‌ 100 నిమిషాల్లో తొలిసెట్‌‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌‌ మొదట్లోనూ జ్వెరెవ్‌‌ ఆధిపత్యమే కొనసాగింది. తొలి నాలుగు గేమ్‌‌ల్లో పరస్పరం సర్వ్‌‌లను బ్రేక్‌‌ చేసుకున్నారు.

ఐదో గేమ్‌‌లో సర్వీస్‌‌ను నిలబెట్టుకున్న జ్వెరెవ్‌‌.. తర్వాతి గేమ్‌‌లో బ్రేక్‌‌ సాధించి 4–2 లీడ్‌‌లో నిలిచాడు. అయితే ఏడో గేమ్‌‌లో సర్వీస్‌‌ను కోల్పోయినా వెంటనే సర్వీస్‌‌ను కాచుకున్న జ్వెరెవ్‌‌ 5–3తో ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో పట్టువదలకుండా పోరాడిన నడాల్‌‌.. వరుస పాయింట్లతో స్కోరును 6–6తో సమం చేశాడు. కానీ సెట్‌‌ టైబ్రేక్‌‌కు వెళ్లే టైమ్‌‌లో గాయపడిన జ్వెరెవ్‌‌ రిటైర్డ్‌‌ హర్ట్‌‌గా వెనుదిరిగాడు. వాకోవర్​ తర్వాత ఊతకర్రల సాయంతో సెంట్రల్​ కోర్టులోకి వచ్చిన జ్వెరెవ్​ ఫ్యాన్స్​కు అభివాదం చేశాడు. కాగా, సిలిచ్​, రుడ్​ మధ్య రెండో సెమీస్​ విజేతతో నడాల్​ ఆదివారం ఫైనల్లో పోటీ పడతాడు.