లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకుడిగా రూపొందిస్తున్న మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘హలో బాసు’ సాంగ్ లాంచ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాట యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఈ సాంగ్ చాలా బాగుంటుంది. కాకపోతే సినిమాలో తీసేయమని చెప్పారు(నవ్వుతూ). ఈ పాట కోసం మా దాసు చాలా కష్టపడ్డాడు. ఇది చాలా ఫన్ సినిమా. కొత్త ఎక్స్‌పెరిమెంట్. సింగీతం గారు ప్రతి సినిమాకీ కొత్తగా ఆలోచిస్తారు. ఇది ఆయన లాంగ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్.
గత కొన్ని నెలలుగా ఆ కలను నిజం చేయడానికి మేమంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. ‘జాతిరత్నాలు’ తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇది. ఆ సినిమాను ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేశారో, ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
వంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ‘దాసు’ అనే క్యారెక్టర్ చేశాను. ఆ పాత్ర చాలా కొత్తగా, చాలా ఫన్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు కచ్చితంగా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జూన్ 11న సినిమా విడుదల కానుంది.
