అబిడ్స్, వెలుగు: కంపెనీకి చెందిన రూ.1.23 కోట్ల విలువైన సరుకును అక్రమంగా మళ్లించి మోసానికి పాల్పడిన కేసులో ఈస్ట్ ప్రశాంత్‌నగర్, మూసారాంబాగ్‌కు చెందిన ఎం.వీర వెంకట కృష్ణారావుకు నాంపల్లి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. 3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్మలక్పేట డిపో మేనేజర్‌గా పనిచేసిన కృష్ణారావు.. 2016లో నకిలీ బిల్లులతో 12,910 యూనిట్ల సరుకును మళ్లించినట్లు ఆడిట్‌లో తేలింది. తన తప్పును అంగీకరించిన నిందితుడు 2017 జనవరి 17, మార్చి 11 తేదీల్లో బాండ్లు రాసిచ్చినా.. సొమ్మును చెల్లించకుండా అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విధులకు గైర్హాజరయ్యాడు.
అంతేకాకుండా కంపెనీ సిబ్బందిని బెదిరించాడు. ఈ వ్యవహారంపై సంస్థకు చెందిన ఆథరైజ్డ్ఆఫీసర్మురళీమోహన్ శివకుమార్ ఇచ్చిన కోర్టు రెఫర్డ్ ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, ఆధారాలను కోర్టులో సమర్పించారు. నేరం రుజువు కావడంతో కృష్ణారావుకు జడ్జి గురువారం శిక్ష ఖరారు చేశారని సీఐ బ్రహ్మమురళి తెలిపారు.
