V6 News

నరసింహుడి జయంతి ఉత్సవాలు... యాదగిరిగుట్టలో ఏప్రిల్ 26 నుంచి 30 వరకు..

నరసింహుడి జయంతి ఉత్సవాలు... యాదగిరిగుట్టలో ఏప్రిల్ 26 నుంచి 30 వరకు..
  •   పాతగుట్టలో 27 నుంచి 30 వరకు వేడుకలు
  •     ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు క్షేత్రం ముస్తాబవుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో యాదగిరిగుట్టలో ఐదు రోజులు, పాతగుట్టలో నాలుగు రోజులు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య–శాశ్వత సేవలు, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. 

యాదగిరిగుట్టలో 26న, పాతగుట్ట ఆలయంలో 27న వివిధ పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్టలతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి ఆలయంలో కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న దబ్బగుంటపల్లిలో స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభించి స్వామివారి కల్యాణంతో ముగించనున్నారు. అదే రోజు మహాపూర్ణాహుతి, నరసింహ జయంతి, నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.