V6 News

గరుడ వాహనం.. పరవాసుదేవ అలంకారం.. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న నారసింహుడి జయంతి ఉత్సవాలు

గరుడ వాహనం.. పరవాసుదేవ అలంకారం.. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న నారసింహుడి జయంతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో జరుగుతున్న నారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం స్వామి వారికి పరవాసుదేవ అలంకార సేవ నిర్వహించారు. ఉదయం నిత్య పూజల అనంతరం అలంకార సేవ చేపట్టారు. యాగశాలలో ద్వార తోరణ పూజ చేసి మూర్తికుంభారాధన, చతుస్థానార్చన, లక్ష్మీనారసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి చేపట్టారు.

 సాయంత్రం ‘గరుడ వాహనం’ పై ‘పరవాసుదేవ’ అలంకార సేవను జరిపారు. స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి తిరువీధుల్లో ఊరేగించారు. మరో వైపు యాదగిరిగుట్ట అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో మంగళవారం ఉదయం ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, నృసింహ, సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం సాయమారాధన, చతుస్థానార్చన, మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. నారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి శ్రీరామావతార అలంకార సేవ 
నిర్వహించనున్నారు.