- రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది
- నిందితులను శిక్షించకుండా స్టూడెంట్లపై లాఠీచార్జా?
- ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన
- తెలిపిన ప్రతిపక్ష నేతలపై క్రూరంగా వ్యవహరిస్తరా?
- రాహుల్ గాంధీ రక్తం నేల చిందింది..
- దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని వెల్లడి
- కొడంగల్‌లో సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ధర్నా
కొడంగల్, వెలుగు: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, నిరుద్యోగులపై దాడులు చేయడమేంటని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం.. ఉల్టా విద్యార్థులపై పాశవికంగా దాడి చేయించడం దారుణమని పేర్కొన్నారు. స్టూడెంట్లకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు.
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ప్రశ్నాపత్రాలు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనకు రాజకీయాలకతీతంగా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. ‘‘విద్యార్థుల తలలు పగలగొట్టారు.. విద్యార్థినులపై దుర్మార్గంగా దాడి చేశారు.. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండా పోయారు.. వారిని ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా?’’ అని ప్రశ్నించారు.
విద్యార్థులకు మద్దతుగా ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు పాశవికంగా వ్యవహరించారని, ఈ క్రమంలో రాహుల్ గాంధీ రక్తం నేల చిందిందని అన్నారు. దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని అన్నారు. బ్రిటిష్‌వారితో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. నీట్‌పేపర్ లీక్‌పై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
దేశాన్ని దోచుకుంటున్నరు..
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2019లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడిందని గుర్తుచేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొందన్నారు. అనుభవం, అర్హత లేకపోయినా ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించారని తెలిపారు.
‘‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కేంద్రం వద్దకు వెళ్లింది. ఢిల్లీలో బీజేపీ వాళ్లతో కేటీఆర్ మాట్లాడి కాంట్రాక్టు ఇప్పించారు” అని ఆరోపించారు. విద్యార్థులు, యువత పక్షాన మోదీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందరం కలిసి పోరాడి మోదీని గద్దె దించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ..
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయం తన నివాసంలో ‘సర్’పై సమీక్ష నిర్వహించిన సీఎం.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నేరుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
