జాతీయవాదం బీజేపీ సొత్తు కాదు

జాతీయవాదం బీజేపీ సొత్తు కాదు

కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ విమర్శ

న్యూఢిల్లీ: ఇండియా–చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని బుధవారం కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇండియాలో చైనీస్ ఆర్మీ ఎంత భూభాగాన్ని ఆక్రమించిందనే విషయంతోపాటు డ్రాగన్ సైన్యాలను అక్కడి నుంచి తొలగించకుండా ఏం చేస్తున్నారో చెప్పాల్సిందిగా మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌‌గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్‌గా చేసుకొని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ మండిపడ్డారు. తాజాగా రవి శంకర్‌‌ మాటలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ స్పందించారు.

‘దేశభక్తి, జాతీయవాదం ఎన్‌డీఏ– బీజేపీ ప్రత్యేక గుత్తాధిపత్యం కిందకు రాదు. కేంద్రాన్ని ప్రశ్నలు అడగడం దేశభక్తికి విరుద్ధం కాదు. ఆయా క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ ఇవ్వకపోవడమే దేశభక్తికి వ్యతిరేకం. మేం చైనా చొరబాట్ల గురించి ప్రధాని మోడీని అడగాలని అనుకుంటున్నాం. అసలు చైనా సైనికులు ఇండియాలోకి ఎలా ప్రవేశించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనే విషయం గురించి దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటోంది. ఇండియా భూభాగంలో 40 నుంచి 60 స్క్వేర్ ఫీట్‌ కి.మీ. టెర్రిటరీని చైనా ఆక్రమించిందన్న దాంట్లో నిజం ఎంత? గాల్వాన్ వ్యాలీలోని పాంగాంగ్ ట్సో లేక్ వద్ద మోహరించి ఉన్న చైనీస్ ఆర్మీని అక్కడి నుంచి తొలగించడానికి ఇండియా సర్కార్ ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిందిగా పీఎం మోడీని అడగాలని భావిస్తున్నాం’ అని మనీశ్ తివారీ పేర్కొన్నారు.