ప్రధాని మోదీ..ఈ పెద్దాయన కాళ్లు మొక్కారు..ఎవరీ మఖన్ లాల్ సర్కార్?

 ప్రధాని మోదీ..ఈ పెద్దాయన కాళ్లు మొక్కారు..ఎవరీ మఖన్ లాల్ సర్కార్?

పశ్చిమబెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిండు సభలో ప్రధాని మోదీ స్వయంగా ఓ పెద్దాయన కాళ్లు మొక్కారు. ఆయనను ఆలింగనం చేసుకొని 98 ఏళ్ల  సీనియర్ బీజేపీ కార్యకర్తను ఘనంగా  సన్మానించారు ప్రధాని మోదీ. ఇంతకీ ఎవరీయన.. వివరాల్లోకి వెళితే.. 

పశ్చిమబెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి ముందు సభావేదికకు వచ్చిన ప్రధాని మోదీ.. సభలో ఉన్న అందరికీ అభివాదం చేస్తూ.. వేదికపై ఉన్న 98 ఏళ్ల  బెంగాల్ కు చెందిన  సీనియర్ బీజేపీ కార్యకర్త అయిన మఖన్ లాల్ సర్కార్ ను ఘనంగా సన్మానించారు. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. శాలువకప్పి వేదికపై ఆత్మీయంగా ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఎవరీ మఖలాల్ సర్కార్..?

మఖన్‌లాల్ సర్కార్ పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్తలలో ఒకరు. స్వాతంత్ర్యానంతర దేశంలోని జాతీయవాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1952లో బెంగాల్ ప్రాంతంలో భారత జాతీయ జెండాను ఎగురవేసే ఉద్యమం సందర్భంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు వెళుతున్న సమయంలో సర్కార్ కాశ్మీర్‌లో అరెస్టు అయ్యారు. 98 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, సర్కార్ పశ్చిమ బెంగాల్‌లోని జాతీయవాద ఉద్యమంలోనూ, బీజేపీ కార్యకర్తలలోనూ క్షేత్రస్థాయి నాయకుడిగా కీలకంగా పనిచేస్తున్నారు. మఖన్ లాల్ ను సన్మానించడం ద్వారా జాతీయవాద ఉద్యమాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సైద్ధాంతిక మూలాలకు, కార్యకర్తలకు నివాళి అర్పించారు. 

పశ్బిమబెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. 

అసెంబ్లీ ఎన్నికలలో కాషాయ పార్టీ ఘనవిజయం సాధించి  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి బీజేపీ నేతగా సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని  మోదీ, హోం మంత్రి అమిత్ షా ,20 రాష్ట్రాల ఎన్డీఏ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.