విజయ్ సీఎం అవ్వాలో.. లేదో.. డిసైడ్ చేసేది ఈ తిరుమావళవన్.. ఇంతకీ ఎవరు ఈ పెద్దమనిషి !

విజయ్ సీఎం అవ్వాలో.. లేదో.. డిసైడ్ చేసేది ఈ తిరుమావళవన్.. ఇంతకీ ఎవరు ఈ పెద్దమనిషి !

చెన్నై: వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి) పార్టీ అధినేత తిరుమావళవన్ మౌనం విజయ్ పార్టీకి శాపంగా మారింది. విజయ్ సీఎం సీటులో కూర్చోవాలో.. లేదో.. డిసైడ్ చేసే అవకాశం వీసీకే పార్టీ చీఫ్ చేతుల్లో ఉంది. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ ఇప్పటికే టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ అధికారికంగా లేఖలు విడుదల చేశాయి. అయితే.. వీసీకే మాత్రం అందివచ్చిన ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని నిర్ణయించింది.

విజయ్ టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వాలంటే కొన్ని షరతులను కూడా వీసీకే విధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి మార్గం సుగమం చేస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమ మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఐతో భేటీ అయిన ఆయన విజయ్​కి మద్దతిచ్చే అంశంపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

వామపక్షాలు శుక్రవారం మధ్యాహ్నం టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తామని ప్రకటించాయి. కానీ.. వీసీకే ఇంకా ఏ నిర్ణయం ప్రకటించకపోవడంతో తమిళనాడులో నంబర్ గేమ్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరుగుతుందని వీసీకే చీఫ్ తిరుమావళవన్ ప్రకటించారు. టీవీకే మద్దతు తెలిపే విషయంలో వీసీకే ఆలస్యం చేస్తుందన్న విమర్శలపై ఆయన స్పందించారు. తాము ఆలస్యం చేయడం లేదని, ఫలితాలు మే 4వ తేదీనే ప్రకటించారని.. ఈరోజు మే 8 అని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకోవడం సహజమని వీసీకే చీఫ్ చెప్పుకొచ్చారు.

గురువారం రాత్రి విజయ్ స్వయంగా వీసీకే అధినేతను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వంలో కీలక శాఖను కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. వీసీకే ఇంతలా ఆలోచించడానికి కారణం పార్టీ సిద్ధాంతాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీసీకే సనాతన వ్యతిరేక సిద్ధాంతంతో ముందుకెళుతున్న పార్టీ. తమిళనాడులో అధికారానికి మతతత్వ శక్తులను దూరంగా ఉంచడానికే టీవీకేకు మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ సమర్థించుకుంది. ఇలాంటి సమయంలో.. ఒక కొత్త పార్టీతో పొత్తును తమ మద్దతుదారులు ఎలా చూస్తారోనని ఆందోళనలో వీసీకే ఉంది.

ఇక.. ఈ వీసీకే పార్టీ పూర్వాపరాల విషయానికొస్తే.. తమిళనాడు రాజకీయాల్లో 2001 నుంచి ఈ పార్టీ పోటీలో నిలిచింది. 2001లో 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి ఒక స్థానంలో గెలిచింది. 2006లో 9 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచింది. 2011లో 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. 2016లో 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో ఓటమి పాలయింది. 2021లో 6 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలిచింది. 2026లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల గెలిచింది. ఈ ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు కీలకంగా మారింది.