మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). షూటింగ్ పనులు పూర్తి చేసుకుని, ఫైనల్ ఎడిట్ కూడా లాక్ చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక అదిరిపోయే బ్యాక్‌స్టేజ్ (BTS) వీడియో నెట్టింట షేక్ చేస్తోంది.
సడన్‌గా సెట్‌లోకి చిరు..
సినిమాలోని అత్యంత కీలకమైన ‘పెద్ది పెహిల్వాన్’ సీక్వెన్స్ షూట్ జరుగుతున్న సమయంలో.. మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సడన్‌గా సెట్స్‌లో అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఈ వీడియోలో చిరంజీవి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంటే.. పెహిల్వాన్ గెటప్స్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఆ తర్వాత మెగాస్టార్ తన శిష్యుడు సుకుమార్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. అనంతరం రామ్ చరణ్, బుచ్చిబాబులతో కలిసి చిరు, సుకుమార్ మానిటర్‌లో రషెస్ చూస్తూ మురిసిపోయారు.
బుచ్చిబాబుకు రిక్వెస్ట్!
ఈ సందడి మధ్య చిరు సరదాగా బుచ్చిబాబును ఒక రిక్వెస్ట్ చేశారు. "నా కోసం చరణ్‌తో సైకిల్ తొక్కించే ఒక్క షాట్ అయినా సినిమాలో పెట్టు" అని చిరంజీవి అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఆ తర్వాత చరణ్, సుకుమార్, బుచ్చిబాబులు బైసెప్స్ (కండలు) చూపిస్తూ ఫోజులివ్వగా.. చిరంజీవి స్వయంగా ఫోటోలు తీశారు. అప్పుడు చరణ్ నవ్వుతూ.. నావి అంత పెద్దగా లేవు సార్.. బుచ్చిబాబు కండలే చాలా బాగున్నాయి అనడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
బ్యాక్‌స్టేజ్ మెంటార్‌గా..
బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ, ఆయన గురువు సుకుమార్ బ్యాక్‌స్టేజ్ మెంటార్‌గా ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నారు. కథా చర్చల నుండి సంగీతం, ఎడిట్ వరకు సుకుమార్ దగ్గరుండి పర్యవేక్షించడం ఈ సినిమాకు మరో పెద్ద అసెట్ నిలిచింది. ఈ సినిమాను జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో జూన్ 3 నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి.
రికార్డు తిరగరాసేనా?
1970-80ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో కుస్తీ, క్రికెట్ క్రీడల చుట్టూ తిరిగే ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక క్రేజీ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
