మిడిల్ క్లాస్కు బిగ్ షాక్.. మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..?

మిడిల్ క్లాస్కు బిగ్ షాక్.. మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..?

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మే 15 లోపు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డీజిల్, పెట్రోల్‌‌పై లీటరు రూ.5 చొప్పున, డొమెస్టిక్​ సిలిండర్లపై రూ.50 చొప్పున పెంచడానికి ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాయని సమాచారం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. ఈ మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి రోజూ సుమారు రూ. 1,600 కోట్లు నష్టపోతున్నాయని OMC వర్గాలు అంచనా వేశాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటున్నాయి. అందుకే.. పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గకపోగా ఈ నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారం నడుస్తోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయమనే ప్రచారం మళ్లీ జోరందుకుంది.

పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. లీటర్ పెట్రోల్పై రూ.18, డీజిల్ పై రూ.35 చొప్పున ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌‌పీసీఎల్ సంస్థలు నష్టాలను భరిస్తున్నాయి. మన దేశం చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.